Share News

ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ఎఫెక్ట్.. ఆ కామెంటేటర్లపై పాక్ బోర్డు వేటు!

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:21 PM

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు, ప్రస్తుత కామెంటేటర్లు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్‌లను ప్రస్తుతం జరుగుతున్న వన్డే ముక్కోణపు సిరీస్ కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పించింది.

ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ఎఫెక్ట్.. ఆ కామెంటేటర్లపై పాక్ బోర్డు వేటు!
Mike Atherton, Nasser Hussain

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు, ప్రస్తుత కామెంటేటర్లు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్‌లను ప్రస్తుతం జరుగుతున్న వన్డే ముక్కోణపు సిరీస్ కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పించింది. జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కుమారులతో అథర్టన్ చేసిన ఇంటర్వ్యూ వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పీసీబీ ప్రకటించిన ఆరుగురు సభ్యుల కామెంటరీ బృందంలో ఈ ఇద్దరి పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.


ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా స్కై స్పోర్ట్స్.. ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఖాసిమ్, సులేమాన్ ఖాన్‌లతో నిర్వహించిన ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. ఈ ఇంటర్వ్యూను మైక్ అథర్టన్ నిర్వహించాడు. ఇందులో ఇమ్రాన్‌ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన కుమారులు ఆరోపించారు. జైలులో పలువురు రాజకీయ ఖైదీలు మరణించారని, తన తండ్రికి కూడా అదే పరిస్థితి కల్పించేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు పేర్కొన్నారు.


ఈ ఇంటర్వ్యూ ప్రసారంపై పీసీబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిరసనగా టెస్టు మ్యాచ్‌లో మధ్యాహ్నం సెషన్‌లో తమ ఆటగాళ్లను మైదానంలోకి పంపబోమని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా స్కై స్పోర్ట్స్‌కు ఫిర్యాదు కూడా చేసింది. పాకిస్థాన్‌లో ప్రభుత్వ ప్రసార సంస్థ పీటీవీ ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అథర్టన్‌తో పాటు నాజర్ హుస్సేన్‌ను తాజా సిరీస్ కామెంటరీ బృందంలోకి తీసుకోలేదనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఇద్దరిని తప్పించడానికి ఇంటర్వ్యూ వివాదమే కారణమని పీసీబీ అధికారికంగా ధ్రువీకరించలేదు.


ఇవి కూడా చదవండి:

పారా ఆసియా గేమ్స్: లాంగ్‌జంప్‌లో నిషద్‌కు స్వర్ణం

నవరాత్రి వేడుకల్లో ధోని సందడి.. అంబానీ ఫ్యామిలీతో కలిసి ఐస్‌క్రీమ్ తింటూ..!

Updated Date - Oct 19 , 2026 | 04:21 PM