పారా ఆసియా క్రీడలు: భారత్‌కు రెండు పతకాలు.. మోనా అగర్వాల్‌కు స్వర్ణం
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:11 PM
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 విభాగంలో మోనా అగర్వాల్ స్వర్ణ పతకం సాధించగా.. అవని లేఖరా రజత పతకాన్ని సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లోని నగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట ప్రారంభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 విభాగంలో మోనా అగర్వాల్ స్వర్ణ పతకం సాధించగా.. అవని లేఖరా రజత పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ విభాగంలోని తొలి రెండు స్థానాలనూ భారత్ కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన ఫైనల్‌లో మోనా 250.0 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అవని 249.6 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇద్దరి మధ్య తేడా కేవలం 0.4 పాయింట్లు మాత్రమే. మరోవైపు దక్షిణ కొరియాకు చెందిన లీ యున్రి 227.9 పాయింట్లతో కాంస్య పతకం సాధించింది.
హోరాహోరీగా పోరు
ఫైనల్‌లో మోనా అగర్వాల్, అవని లేఖరా తొలి స్థానం కోసం చివరి వరకు పోటీపడ్డారు. నిలకడైన ప్రదర్శనతో మోనా స్వర్ణ పతకాన్ని అందుకుంది. అవని రజతంతో సరిపెట్టుకుంది. ఇద్దరు భారత షూటర్లూ మిగతా వారి కంటే మెరుగైన ప్రదర్శన చేయడంతో భారత్‌కు ఈ విభాగంలో స్వర్ణ, రజత పతకాలు లభించాయి.
అర్హత పోటీల్లో మోనా రికార్డు
ఫైనల్‌కు ముందు జరిగిన అర్హత పోటీల్లోనూ మోనా అగర్వాల్ సత్తాచాటింది. ఆరు సిరీస్‌లతో కలిపి 629.1 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ స్కోరుతో ఆసియా పారా గేమ్స్ అర్హత రికార్డును బద్దలుకొట్టింది. గతంలో చైనాకు చెందిన జాంగ్ కుపింగ్ పేరిట ఈ రికార్డు ఉండేది.
ఇవీ చదవండి