పారా ఆసియా గేమ్స్: లాంగ్‌జంప్‌లో నిషద్‌కు స్వర్ణం
ABN , Publish Date - Oct 19 , 2026 | 03:35 PM
ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్ నిషద్ కుమార్ సత్తా చాటాడు. హైజంప్‌లో ఇప్పటికే దేశానికి ఎన్నో పతకాలు అందించిన ఈ స్టార్ అథ్లెట్.. తొలిసారి ప్రధాన అంతర్జాతీయ పోటీలో లాంగ్‌జంప్ బరిలోకి దిగి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్ నిషద్ కుమార్ సత్తా చాటాడు. హైజంప్‌లో ఇప్పటికే దేశానికి ఎన్నో పతకాలు అందించిన ఈ స్టార్ అథ్లెట్.. తొలిసారి ప్రధాన అంతర్జాతీయ పోటీలో లాంగ్‌జంప్ బరిలోకి దిగి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల లాంగ్‌జంప్ టీ47 విభాగంలో 7.11 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచాడు. కాగా ఆసియా పారా క్రీడలు-2026లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం.
పోటీ ప్రారంభం నుంచే నిషద్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తొలి ప్రయత్నంలోనే 6.95 మీటర్లు దూకి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకుంటూ రెండుసార్లు మెరుగైన దూరాన్ని నమోదు చేశాడు. చివరకు 7.11 మీటర్లతో స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. పోటీలో మిగతా అథ్లెట్లు ఎవరూ అతడి ప్రదర్శనను అధిగమించలేకపోయారు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఖసనోవ్ ఒమద్బెక్ ఐదో ప్రయత్నంలో 6.99 మీటర్లు దూకి రెండో స్థానంలో నిలిచి రజతం సాధించగా.. శ్రీలంకకు చెందిన మొహమ్మదు సఫ్రాన్ కాంస్య పతకం అందుకున్నాడు.
హైజంప్‌లో స్టార్.. ఇప్పుడు లాంగ్‌జంప్‌లోనూ!
నిషద్ కుమార్ అంటే భారత అథ్లెటిక్స్‌లో హైజంప్‌కు మారుపేరు. పురుషుల హైజంప్ టీ47 విభాగంలో ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 2024 పారిస్ పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గుర్తింపు తెచ్చాడు. అమెరికాలో శిక్షణ పొందుతున్న నిషద్.. గత ఏడాది నుంచి లాంగ్‌జంప్ పోటీల్లోనూ పాల్గొంటున్నాడు. ఇటీవల ఒమన్ రాజధాని మస్కట్‌లో జరిగిన సాధారణ అథ్లెటిక్స్ పోటీలోనూ నిషద్ పాల్గొన్నాడు. అక్కడ 7.22 మీటర్లు దూకి ఎనిమిది మంది పోటీదారుల్లో ఐదో స్థానంలో నిలిచాడు. అయితే ఆసియా పారా క్రీడల్లో మాత్రం తన తొలి ప్రయత్నంలోనే ప్రధాన లాంగ్‌జంప్ పోటీలో స్వర్ణం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇవీ చదవండి