Share News

ఒక్కడే 400 పరుగులు.. రంజీ చరిత్రలోనే చిన్మయ్ అత్యంత అరుదైన ఘనత

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:43 PM

దేశవాళీ క్రికెట్‌లో మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

ఒక్కడే 400 పరుగులు.. రంజీ చరిత్రలోనే చిన్మయ్ అత్యంత అరుదైన ఘనత
Chinmay Sutar

ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ క్రికెట్‌లో మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న ప్లేట్ డివిజన్ మ్యాచ్‌లో చిన్మయ్ ఈ ఘనత సాధించాడు. 517 బంతుల్లో అజేయంగా 400 పరుగులు చేసి మిజోరం భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తన ఇన్నింగ్స్‌లో 46 ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. చిన్మయ్ క్రీజులో పాతుకుపోయాడు. చివరకు మిజోరం జట్టు 9 వికెట్ల నష్టానికి 581 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.


ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగుల మార్కును అందుకోవడం అత్యంత అరుదైన ఘనత. ఈ జాబితాలో బ్రియాన్ లారా, డాన్ బ్రాడ్‌మన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. భారత దేశవాళీ క్రికెట్‌లో గతంలో మహారాష్ట్రకు చెందిన భౌసాహెబ్ నింబాల్కర్ 1948లో కాథియావార్‌పై అజేయంగా 443 పరుగులు చేశాడు. ఇప్పటివరకు రంజీ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. తాజాగా చిన్మయ్ 400 పరుగులతో ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీకి చేరువగా వచ్చి 99 పరుగుల వద్ద రనౌట్ అవ్వడం గమనార్హం.


రంజీ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు

  • 443 – భౌసాహెబ్ నింబాల్కర్

  • 400 – చిన్మయ్ సుతార్

  • 379 – పృథ్వీ షా

  • 377 – సంజయ్ మంజ్రేకర్

  • 366 – ఎం.వి. శ్రీధర్

  • 366 – తన్మయ్ అగర్వాల్


ప్రపంచ క్రికెట్‌లోనూ అరుదైన ఘనత

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు బ్రియాన్ లారా పేరిట ఉంది. 1994లో వార్విక్‌షైర్ తరఫున డర్హామ్‌పై అతడు అజేయంగా 501 పరుగులు చేశాడు. ఆ తర్వాత హనీఫ్ మహమ్మద్ (499), డాన్ బ్రాడ్‌మన్ (452*), భౌసాహెబ్ నింబాల్కర్ (443*) వంటి దిగ్గజాలు ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా చిన్మయ్ సుతార్ 400 పరుగులతో ఈ అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్ల సరసన చేరాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో పృథ్వీ షా 2023లో అస్సాంపై చేసిన 379 పరుగుల రికార్డును అధిగమించి రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.


ఇవి కూడా చదవండి:

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఓజా.. ప్యానెల్‌లో రమేశ్ పొవార్‌కు చోటు

ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ఎఫెక్ట్.. ఆ కామెంటేటర్లపై పాక్ బోర్డు వేటు!

Updated Date - Oct 19 , 2026 | 05:43 PM