Share News

తొలిరోజే తగ్గేదేలే!

ABN , Publish Date - Oct 20 , 2026 | 06:44 AM

పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తొలిరోజే సంచలన ప్రదర్శనతో అదరగొట్టారు. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో ఒక్కరోజే 11 పతకాలు కొల్లగొట్టారు...

తొలిరోజే తగ్గేదేలే!

పారా ఆసియా క్రీడలు

  • 4 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్యాలతో 11 పతకాలు

  • మెరిసిన తెలుగు అథ్లెట్లు రవి కార్తీక్‌, రవన్ని

నగోయ: పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తొలిరోజే సంచలన ప్రదర్శనతో అదరగొట్టారు. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో ఒక్కరోజే 11 పతకాలు కొల్లగొట్టారు. ఇందులో 4 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్యాలున్నాయి. ఇక, తెలుగు స్విమ్మర్‌ రవికార్తీక్‌ బుడిగిన, రన్నర్‌ రవన్ని వలసనైని పతకాలతో మెరవడం ఆరంభ రోజు పోటీల్లో విశేషం. షూటర్‌ మోనా అగర్వాల్‌, లాంగ్‌ జంపర్‌ నిషాద్‌ కుమార్‌, మిడిల్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ సౌమ్య, జావెలిన్‌ త్రోయర్‌ రింకూ పసిడి పతకాలు సాధించిన వారిలో ఉన్నారు. ఇలా తొలిరోజే మన అథ్లెట్ల జోరుతో భారత్‌ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

షూటింగ్‌లో స్వర్ణ, రజతాలు మనవే

మహిళల షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ (ఎస్‌హెచ్‌1) ఫైనల్స్‌లో భారత స్టార్‌ మోనా అగర్వాల్‌ 250 పాయింట్లు స్కోరు చేసి ఆసియా పారా క్రీడల రికార్డు ప్రదర్శనతో స్వర్ణం ఎగరేసుకుపోయింది. ఇక, డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌కే చెందిన అవనీ లేఖార.. మోనా కంటే 0.4 పాయింట్ల తేడాతో వెనుకంజలో నిలిచి రెండో స్థానానికి పరిమితమైంది. అవనీ ఓవరాల్‌గా 249.06 స్కోరుతో రజతం అందుకుంది. లీ యున్రీ (దక్షిణ కొరియా) కాంస్యం నెగ్గింది. కాగా.. ఈ ప్రదర్శనతో 24 ఏళ్ల అవనీ 2028 లాస్‌ ఏంజెల్స్‌ పారాలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకుంది. ఇక, గతనెల ప్రపంచ పారా షూటింగ్‌లో రజతం నెగ్గడంతోనే మోనా పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది.

అథ్లెటిక్స్‌లో అదరహో

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగంలో భారత అథ్లెట్లు మొదటి రోజే ఆరు పతకాలతో ధమాకా సృష్టించారు. పురుషుల లాంగ్‌జం్‌పలో నిషాద్‌ కుమార్‌ 7.11 మీటర్లు దూకి అగ్రస్థానంతో స్వర్ణం గెలిచాడు. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు తన కుడిచేయి ప్రమాదవశాత్తు గడ్డికోసే యంత్రంలో పడడంతో నిషాద్‌కు మోచేతిదాకా తొలగించారు. ఇక, ఓ అంతర్జాతీయ లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో పోటీపడ్డ తొలిసారే నిషాద్‌ విజేతగా నిలవడం విశేషం. అంధురాలైన లాంగ్‌డిస్టెన్స్‌ రన్నర్‌ సౌమ్య 1500 మీటర్ల టీ12/టీ13 ఈవెంట్‌లో 5:12.39 సెకన్ల టైమింగ్‌తో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేసి పసిడి పతకం చేజిక్కించుకుంది. ఇదే విభాగంలో రాధా వెంకటేశ్‌ (5:12.39 సె) రెండో స్థానంతో రజతం దక్కించుకుంది. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌46 ఈవెంట్‌లో ఈటెను 65.11 మీటర్ల దూరం విసిరిన రింకూ పసిడి గెలిచాడు. భారత్‌కే చెందిన అజిత్‌ సింగ్‌ (65.02 మీ.) రజతానికి పరిమితమయ్యాడు.


జూడోకాల జోష్‌

జూడోలో భారత క్రీడాకారులు రెండు పతకాలతో సత్తా చాటారు. మహిళల జే2, 52 కిలోల విభాగంలో కోకిల రజతం.. పురుషుల జే1, 70 కిలోల కేటగిరిలో కపిల్‌ పర్మార్‌ కాంస్యం కైవసం చేసుకున్నారు. ఫైనల్లో అయిబికె ఉలాన్‌బెక్‌ (కిర్గిస్థాన్‌) చేతిలో కోకిల ఓటమిపాలై రన్నర్‌పగా నిలిచింది. సెమీ్‌సలో ఓడిన కపిల్‌ కాంస్య పోరులో అనాఫ్‌ రఫిల్‌ (ఇండోనేసియా)పై గెలుపొందాడు.

టీటీ, బ్యాడ్మింటన్‌లో పతకాలు ఖరారు

టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారులు తమ విభాగాల్లో ముందంజ వేసి పతకాలు ఖరారు చేసుకున్నారు. మహిళల టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ క్లాస్‌ 6 ఈవెంట్‌లో ప్రాచీ పాండే, క్లాస్‌ 3 ఈవెంట్‌లో సోనాల్‌బెన్‌, క్లాస్‌ 4-5 కేటగిరిలో భవినా పటేల్‌.. బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్‌ఎల్‌3-ఎ్‌సయూ 5లో నితేశ్‌ కుమార్‌/తులసిమతి మురుగేశన్‌ జోడీ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి కనీసం కాంస్యాలు ఖాయం చేసుకున్నారు.

తెలుగు వెలుగులు

పారా ఆసియా క్రీడల్లో తొలిరోజే తెలుగు వెలుగులు విరజిమ్మాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవి కార్తీక్‌ బుడిగిన, రవన్ని వలసనైని పతకాలతో భళా అనిపించారు. ఏలూరుకు చెందిన రవి కార్తీక్‌ పురుషుల స్విమ్మింగ్‌ 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఎస్‌13 ఈవెంట్‌లో 56.68 సెకన్లలో లక్ష్యాన్ని అందుకొని రెండో స్థానంతో రజతం సాధించాడు. విశాఖపట్నానికి చెందిన రవన్ని వలసనైని మహిళల 1500 మీటర్ల రేసు టీ11 కేటగిరిలో మూడో స్థానంతో కాంస్యం అందుకుంది. పాక్షిక అంధత్వ స్విమ్మర్ల కేటగిరిలో రవి కార్తీక్‌ బరిలోకి దిగగా.. పూర్తి అంధత్వమున్న రేసర్ల ఈవెంట్‌ నుంచి రవన్ని పోటీ పడింది.

Also Read:

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో

ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్‌ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే

Updated Date - Oct 20 , 2026 | 06:44 AM