Share News

భారత్-పాక్ మ్యాచ్.. అర్ష్‌దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు?

ABN , Publish Date - Feb 14 , 2026 | 09:50 AM

20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.

భారత్-పాక్ మ్యాచ్.. అర్ష్‌దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు?
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకలోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవచ్చని సన్నీ తెలిపాడు.


గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ తన పూర్తి కోటాను పూర్తి చేయలేకపోయిన విషయం తెలిసిందే. అందులోనూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్‌లో తొలి ఓవర్ హార్దిక్‌కు అప్పగించాడు. శివం దూబె కూడా రెండు ఓవర్లు వేసి ఓ వికెట్ పడగొట్టాడు. అయితే పాక్‌తో మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకునే సూర్య.. బౌలింగ్‌లో మార్పులు చేసినట్లు గావస్కర్ విశ్లేషించాడు.


‘అర్ష్‌దీప్ తన కోటా పూర్తి చేయలేకపోయాడు. హార్దిక్ తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే తర్వాతి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ఆడకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. శ్రీలంకలో పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. భారత్ గతంలో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కాబట్టి పాక్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ స్థానాన్ని కుల్దీప్ భర్తీ చేసే అవకాశం ఉంది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌కు వచ్చిన ప్రతిసారి వికెట్లు తీస్తుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. సంజు శాంసన్ తన ఆటను మెరుగుపరుచుకోవాలి. ప్రధానంగా అతడు ఓపెనింగ్‌కు వెళ్లినప్పుడు టెక్నిక్‌ను మార్చుకోవాలి. పాక్‌తో పోరులో సంజు ఆడితే మాత్రం.. ఎక్కువ సమయం క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాలి’ అని సన్నీ అన్నాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Updated Date - Feb 14 , 2026 | 09:51 AM