కంగారూలకు షాక్
ABN , Publish Date - Feb 14 , 2026 | 01:33 AM
ఈ టీ20 వరల్డ్‌క్‌పలో చిన్న జట్లు అంచనాలకు మించిన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నా.. ఇప్పటిదాకా విజయం రుచి చూడలేకపోయాయి.
23 రన్స్‌తో జింబాబ్వే సంచలన విజయం
కొలంబో: ఈ టీ20 వరల్డ్‌క్‌పలో చిన్న జట్లు అంచనాలకు మించిన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నా.. ఇప్పటిదాకా విజయం రుచి చూడలేకపోయాయి. కానీ టోర్నీలో శుక్రవారం అతి పెద్ద సంచలనం నమోదైంది. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపిన జింబాబ్వే జట్టు 23 రన్స్‌తో గెలిచింది. పేసర్లు ముజరబానీ (4/17), ఇవాన్స్ (3/23) చెలరేగి గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే ఒమన్‌పై గెలిచిన జింబాబ్వే గ్రూప్ ‘బి’లో నాలుగు పాయింట్లతో రెండోస్థానం దక్కించుకుంది. అలాగే టీ20 వరల్డ్‌క్‌పల్లో ఆసీస్‌తో తలపడిన రెండుసార్లూ జింబాబ్వేనే నెగ్గడం విశేషం. మొదట 2007 టోర్నీలో ఆఖరి ఓవర్‌లో అద్భుత విజయాన్నందుకుంది. ఓవరాల్‌గా పరిమిత ఓవర్లలో ఆసీ్‌సపై గెలవడం ఈ జట్టుకిది ఐదోసారి. గతంలో మూడుసార్లు వన్డేల్లో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 2 వికెట్లకు 169 పరుగులు చేసింది. గాయాల కారణంగా ప్రధాన బౌలర్లు లేకుండానే బరిలోకి దిగిన ఆసీస్ మూల్యం చెల్లించుకుంది.ఓపెనర్లు బ్రయాన్ బెనెట్ (64 నాటౌట్), మరుమని (35), రియాన్ బర్ల్ (35), సికిందర్ రజా (25 నాటౌట్) ఎలాంటి తడబాటు లేకుండా ఆడారు. అలాగే బెనెట్ తొలి వికెట్‌కు 61, రెండో వికెట్‌కు 70, మూడో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. గ్రీన్, స్టొయినిస్ చెరో వికెట్ తీశారు. ముజరబానీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. మరోవైపు ఒమన్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన జింబాబ్వే వెటరన్ కీపర్ బ్రెండన్ టేలర్ టోర్నీకి దూరమయ్యాడు.
టాపార్డర్ బేజారు: ఓ మాదిరి ఛేదనలో ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా, ముగ్గురు డకౌటయ్యారు. వాస్తవానికి ఆసీస్ ఈ లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తుందనుకున్నా, పేసర్లు ముజరబానీ, ఇవాన్స్ బెదరగొట్టారు. వీరి దెబ్బకు 29 పరుగులకే టాప్-4 బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఈ దశలో రెన్‌షా (65), మ్యాక్స్‌వెల్ (31) నిలవడంతో ఆసీస్ గెలుస్తుందనిపించింది. కానీ ఐదో వికెట్‌కు 77 రన్స్ జత చేశాక మ్యాక్సీని స్పిన్నర్ బర్ల్ బౌల్డ్ చేశాడు. అక్కడి నుంచి తడబాటుకు లోనైన ఆసీస్ మరో 40 రన్స్ జోడించి మిగిలిన 5 వికెట్లను కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది.