బౌలర్లు టోర్నమెంట్లనే గెలిపిస్తారు.. టీమిండియాకు భజ్జీ కీలక సూచన
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:12 PM
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. టీమిండియాకు ఓ కీలక సూచన చేశాడు. భారత్ ఈ మెగా టోర్నీలో కచ్చితంగా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రాయ్‌పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా కామెంట్రీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ఫార్మాట్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనలు చేస్తూ వస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న ఐదు టీ20ల సిరీస్‌లో 2-0తేడాతో ఆధిక్యంలో ఉంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. టీమిండియాకు ఓ కీలక సూచన చేశాడు. భారత్ ఈ మెగా టోర్నీలో కచ్చితంగా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రాయ్‌పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా కామెంట్రీలో అతడు(Harbhajan Singh) ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘టీ20 ప్రపంచ కప్(T20 WC 2026)లో టీమిండియా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలి. బ్యాటర్లు బహుశా మ్యాచుల్ని గెలిపిస్తారేమో.. కానీ బౌలర్లు టోర్నమెంట్లనే గెలిపిస్తారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి జోడీని కచ్చితంగా వరల్డ్ కప్‌లో ఆడించాలి. వీరు బ్యాటర్ల భాగస్వామ్యాలను సమర్థంగా విడగొడతారు. మ్యాచును భారత్ వైపు తిప్పేస్తారు. తేమ పరిస్థితుల్లో, ఫ్లాట్ పిచ్ మీద కుల్దీప్, వరుణ్ చక్రవర్తి.. ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. ఈ ఐదుగురూ నిజమైన వికెట్ టేకర్స్. 8 మంది బ్యాటర్లతో భారత్ బరిలోకి దిగాల్సిన అవసరం లేదు. ఒకవేళ త్వరగా వికెట్లు పడ్డా.. బ్యాటింగ్ డెప్త్ వల్ల తేలిగ్గా 14 నుంచి 15 ఓవర్ల వరకు మేనేజ్ చేయొచ్చు. ప్రయోగాలు హోం సిరీస్‌ల్లో చేసుకోవచ్చు. కానీ గ్లోబల్ టోర్నమెంట్లలో క్లారిటీ, బ్యాలెన్స్ ఉండాలి. మ్యాచ్ విన్నర్లనే ఆడించాలి’ అని భజ్జీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
కాగా న్యూజిలాండ్‌తో రెండో టీ20లో కుల్దీప్ యాదవ్ 35 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 15.2 ఓవర్లలోనే ఛేదించింది.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌తో రెండో టీ20.. పలు రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా
నా ప్రశ్నకు సమాధానం పరుగులే: ఇషాన్ కిషన్