న్యూజిలాండ్‌తో రెండో టీ20.. పలు రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:29 AM
న్యూజిలాండ్‌తో రాయ్‌పుర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 15.2 ఓవర్లలోనే ఆటను ముగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా పలు రికార్డులను నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. 209 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా.. 15.2 ఓవర్లలోనే ఆటను ముగించింది. అయితే ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే..
అత్యంత వేగంగా ఛేజింగ్..
టీ20 క్రికెట్ చరిత్రలో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా భారత్(Team India) ప్రపంచ రికార్డు సృష్టించింది. 209 పరుగులను మరో 28 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా పూర్తి చేసింది. అంతకు ముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది.
ఇషాన్ ‘ఫాస్టెస్ట్’ ఫిఫ్టీ
సుదీర్ఘ కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన ఇషాన్ కిషన్(Ishan Kishan).. రెండో టీ20లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. న్యూజిలాండ్‌పై వేగవంతమైన టీ20 అర్ధశతకాన్ని సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. కాగా ఇషాన్ మొత్తం 32 బంతుల్లోనే 76 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సూర్య ఆన్ ‘ఫామ్’
కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(SuryaKumar Yadav) ఈ మ్యాచ్‌తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. గత కొంత కాలంతో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న స్కై.. 463 రోజుల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఓపెనర్లు త్వరగా పెవిలియన్ చేరినప్పటికీ.. సూర్య కెప్టెన్ నాక్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
100వ హోం మ్యాచ్..
భారత గడ్డపై టీమిండియా ఆడిన 100వ టీ20 మ్యాచ్ ఇది. రాయ్‌పుర్ వేదికగా జరిగిన ఈ మైలురాయి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన టీమిండియా.. తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
అగ్రస్థానంలో ఆసీస్..
మరోవైపు 200కి పైగా లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించడం ఇది ఆరో సారి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా(7 సార్లు) అగ్రస్థానంలో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కివీస్‌కు బిగ్ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్
అభిషేక్ చేసిన పనికి ఫిదా అయిన గావస్కర్.. వీడియో వైరల్