Share News

కివీస్‌కు బిగ్ షాక్.. టీ20 వరల్డ్‌ కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్

ABN , Publish Date - Jan 23 , 2026 | 10:55 AM

టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ముంగిట న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ ఆడం మిల్నేకు గాయమైంది. దీంతో అతడుఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.

కివీస్‌కు బిగ్ షాక్.. టీ20 వరల్డ్‌ కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్
Adam Milne injury

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్-2026(T20 World Cup) మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. టైటిల్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అన్ని ప్రధాన జట్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్ ఆడం మిల్నేకు గాయమైంది. దీంతో అతడు టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ధ్రువీకరించింది.


మిల్నే(Adam Milne injury) తొడ కండరాలకు గాయమైందని.. త్వరలో జరిగే ఐసీసీ టోర్నీ సమయానికి కోలుకోవడం కష్టమని కివీస్ బోర్డు తెలిపింది. గాయం కారణంగానే మిల్నే వరల్డ్‌కప్‌ జట్టుకు దూరమైనట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం.. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో మిల్నే సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత ఆదివారం(జనవరి 18న) జరిగిన మ్యాచ్‌‌లో బౌలింగ్ చేస్తూ అతడు గాయపడ్డాడు. తర్వాత ఎక్స్-రే తీయించగా గాయం తీవ్రత పెద్దగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.


ఆడం స్థానంలో అతడే..

ఆడం మిల్నే స్థానంలో కైలీ జెమీసన్‌(Kyle Jamieson) తుది జట్టులోకి రానున్నాడు. ప్రస్తుతం.. జెమీసన్ భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఆడుతున్నాడు. రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న అతడిని ప్రధాన జట్టులోకి చేర్చింది కివీస్ బోర్డు. జెమీసన్‌ స్థానంలో మరో ట్రావెలింగ్‌ రిజర్వ్‌ను త్వరలోనే ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉండగా.. వరల్డ్‌కప్‌ జట్టులో భాగమైన లాకీ ఫెర్గూసన్‌ కూడా పిక్కల నొప్పి కారణంగా టీమిండియాతో సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఒకవేళ వరల్డ్‌ కప్‌-2026 నాటికి కోలుకోకపోతే అతడు కూడా జట్టుకు దూరమయ్యే పరిస్థితి.


న్యూజిలాండ్ జట్టును(New Zealand Cricket) గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే బ్లెయిర్ టిక్నర్, నాథన్‌ స్మిత్‌, విలియమ్‌ ఒరూర్కీ, బెన్‌ సియర్స్‌ వంటి ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. ఇక కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌, మార్క్‌ చాప్‌మన్‌, హెన్రీలు ఇటీవలే గాయాల నుంచి కోలుకున్నారు. టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా న్యూజిలాండ్ తమ ఏకైక వార్మప్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 6న ముంబైలో అమెరికాతో తలపడనుంది. కివీస్ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 8న చెన్నైలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతుంది. ఫిబ్రవరి 10న యూఏఈతో, ఫిబ్రవరి 15న దక్షిణాఫ్రికాతో కివీస్ తలపడనుంది.

టీ20 ప్రపంచకప్-2026 న్యూజిలాండ్‌ జట్టు:

మిచెల్ శాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, కైలీ జెమీసన్‌, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌లో టీ20 ప్రపంచ కప్ 2026 ఆడేదే లేదు: బీసీబీ

అభిషేక్ చేసిన పనికి ఫిదా అయిన గావస్కర్.. వీడియో వైరల్

Updated Date - Jan 23 , 2026 | 11:20 AM