Share News

నా ప్రశ్నకు సమాధానం పరుగులే: ఇషాన్ కిషన్

ABN , Publish Date - Jan 24 , 2026 | 10:53 AM

రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 76 పరుగులతో చెలరేగి ఆడాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై ఇషాన్ మాట్లాడాడు. తన ప్రశ్నలన్నింటికీ సమాధానం పరుగులే అని చెప్పాడు.

నా ప్రశ్నకు సమాధానం పరుగులే: ఇషాన్ కిషన్
Ishan Kishan

ఇంటర్నెట్ డెస్క్: రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. అనంతరం 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 15.2 ఓవర్లలోనే ఆటను ముగించింది. అయితే ఛేదనకు దిగిన టీమిండియా ఆదిలో కాస్త తడబడింది. ఓపెనర్లు సంజు శాంసన్(6), అభిషేక్ శర్మ(0) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. టీమిండియా 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడొచ్చారు క్రీజులోకి ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్! 32 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. 11 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 76 పరుగులు చేశాడు. మరోవైపు సూర్యకుమార్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 82* పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 48 బంతుల్లోనే ఏకంగా 122 పరుగులు జత చేశారు.


బాదుడే బాదుడు..

ముఖ్యంగా ఇషాన్ కిషన్(Ishan Kishan) ఫోర్లు, సిక్సులతో కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఎక్కడ బంతిని సంధించినా.. ఇషాన్ దాన్ని బౌండరీకి తరలిస్తూ చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్ల దగ్గర ఎలాంటి సమాధానమే లేకపోయింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత భారత తుది జట్టులోకి పునరాగమనం చేసిన ఇషాన్.. నాగ్‌పుర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రెండో మ్యాచ్‌లో మాత్రం ఊహకందని విధ్వంసం సృష్టించాడు. దేశవాళీల్లో నిలకడగా రాణించి టీమిండియాలో చోటు దక్కించుకున్న ఇషాన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా సత్తా చాటుతున్నాడు.


మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడాడు. ‘నాకు నేను ఓ ప్రశ్న వేసుకున్నాను. నేను మళ్లీ సాధించగలనా? లేదా? అని. నేను చేయగలననే నమ్మకంతోనే ముందుకు సాగాను. చక్కటి షాట్లు ఆడాను. నా ప్రశ్నకు సమాధానం పరుగులే. అందుకే నేను పరుగులు చేయాలని చూశాను. దేశవాళీల్లోనూ రన్స్ రాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పొందాను. అలాగే ఇది కూడా నాకు మంచి రోజు’ అని ఇషాన్ కిషన్ అన్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

కివీస్‌కు బిగ్ షాక్.. టీ20 వరల్డ్‌ కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్

అభిషేక్ చేసిన పనికి ఫిదా అయిన గావస్కర్.. వీడియో వైరల్

Updated Date - Jan 24 , 2026 | 10:53 AM