Share News

సీఎస్కే-ఎంఐ మ్యాచ్: ధోని, రోహిత్ బరిలోకి దిగనున్నారా..? కోచ్‌ల స్పందనిదే..

ABN , Publish Date - May 02 , 2026 | 03:24 PM

ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది. మరి ధోని, రోహిత్ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారా? లేదా? అనే సందేహాలు వస్తున్న నేపథ్యంలో.. ఆయా జట్ల కోచ్‌లు ఈ విషయంపై స్పందించారు.

సీఎస్కే-ఎంఐ మ్యాచ్: ధోని, రోహిత్ బరిలోకి దిగనున్నారా..? కోచ్‌ల స్పందనిదే..
CSK vs MI

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది. అయితే సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ఎంఐ కీలక ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్‌ల నుంచి ఆటకు దూరమయ్యాడు. నేడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా రోహిత్, ధోని, సూర్యకుమార్ యాదవ్ కలిసిన వీడియోను చెన్నై తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. మరి ధోని, రోహిత్ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారా? లేదా? అనే సందేహాల నేపథ్యంలో.. ఆయా జట్ల కోచ్‌లు ఈ విషయంపై స్పందించారు. ముంబై హెడ్ కోచ్ మహేల జయవర్ధనె, చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ మాట్లాడారు.


ధోని బాగున్నాడు..

‘ఎంఎస్ ధోని గాయం నుంచి కోలుకున్నాడు. తప్పకుండా మ్యాచ్‌లు ఆడతాడు. అయితే ఇవాళ ముంబైతో మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేను. అతడి బ్యాటింగ్, కీపింగ్ నైపుణ్యంపై మాకు ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికీ అతడికి మంచి రన్నింగ్ పవర్ ఉంది’ అని బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తెలిపాడు. అయితే ధోని ప్రతి మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తూనే ఉన్నాడు. ఈ మ్యాచ్‌తోనైనా ధోని బరిలోకి దిగితే చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


వారిదే తుది నిర్ణయం..

‘రోహిత్ శర్మ గాయం నుంచి త్వరగా కోలుకున్నాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు. రోజూ అతడిని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. మ్యాచ్ సమయానికి ఎలా ఉంటాడనేది గమనించి నిర్ణయం తీసుకుంటాం. అతడి విషయంలో మెడికల్ టీమ్ ఏం చెబితే అదే పాటిస్తాం’ అని ఎంఐ హెడ్ కోచ్ మహేల జయవర్ధనె వెల్లడించాడు. ఇదిలా ఉండగా, ముంబై ఇండియన్స్ 8 మ్యాచుల్లో రెండు గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరోవైపు సీఎస్కే 8 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి ఏడో స్థానంలో కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..

ఐపీఎల్‌లో అత్యధిక 'పీవోటీఎం' అవార్డులు అందుకున్న ప్లేయర్లు వీరే

Updated Date - May 02 , 2026 | 03:34 PM