Share News

కోహ్లీ రిటైర్మెంట్ వెనుక అజిత్ అగార్కర్ పాత్ర ఉందేమో.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు!

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:22 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ రిటైర్మెంట్ వెనుక ప్రధాన సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యవహార శైలే కారణమై ఉండవచ్చని జాఫర్ అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ రిటైర్మెంట్ వెనుక అజిత్ అగార్కర్ పాత్ర ఉందేమో.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు!
Virat Kohli

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ రిటైర్మెంట్ వెనుక ప్రధాన సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యవహార శైలే కారణమై ఉండవచ్చని జాఫర్ అభిప్రాయపడ్డాడు. 2025 మే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందే కోహ్లీ ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. అగార్కర్ తనను ట్రీట్ చేసిన విధానం పట్ల కోహ్లీ కొంత అసంతృప్తిగా, చేదు అనుభవంతో ఉన్నాడని, అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని జాఫర్ పేర్కొన్నాడు . కోహ్లీ తన కెరీర్‌లో 123 టెస్టులాడి 46.85 సగటుతో 9230 పరుగులు సాధించి, 30 సెంచరీలు నమోదు చేసిన విషయం తెలిసిందే.


తన యూట్యూబ్ ఛానెల్ చర్చలో జాఫర్ మాట్లాడుతూ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ రెండు ప్రపంచ కప్‌లు, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంలో విజయవంతమైందని అన్నాడు. ఐసీసీ ట్రోఫీలు గెలిచే విషయంలో అగార్కర్‌కి 10కి 7 మార్కులు ఇస్తానని తెలిపాడు. ఆటగాళ్లను డీల్ చేసే విధానంలో మాత్రం లోపాలు ఉన్నాయని జాఫర్ విమర్శించాడు. టీ20 ప్రపంచ కప్ గెలిచినా సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టడం, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీల ఎంపికపై స్పష్టత లేకపోవడం, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ విషయంలో అగార్కర్ అనుసరించిన విధానాలను జాఫర్ ప్రశ్నించాడు.


అన్నిటికంటే ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పట్ల అగార్కర్ వ్యవహరించిన తీరు సరైనది కాదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. అలానే ఐపీఎల్ ముగిసిన వెంటనే శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ కట్టబెట్టడం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా రోహిత్‌ను సారథ్యం నుంచి తప్పించడం వంటి నిర్ణయాలు సరైనవి కాదన్నాడు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో అగార్కర్ ముందుంటారని, అయితే సీనియర్ ఆటగాళ్ల పట్ల మరింత గౌరవంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.


ఇవి కూడా చదవండి:

తూ.గో జిల్లాలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు

బైక్ ఇంజిన్ ఆయిల్ మార్చడం లేదా..? నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్యలు తప్పవు!

టీమిండియాతో సిరీస్‌.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ

Updated Date - Oct 10 , 2026 | 05:22 PM