భూమిని తాకనున్న సౌర తుఫాను.. అక్టోబర్ 11న ఏం జరగనుంది..?
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:00 PM
భూమిపై అక్టోబర్ 11న మధ్యస్థ స్థాయి భూ అయస్కాంత తుఫాను సంభవించే అవకాశం ఉందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలనా సంస్థ హెచ్చరించింది. సూర్యుడిపై సంభవించిన రెండు భారీ విస్ఫోటనాల కారణంగా సౌర పదార్థాలు భూమి వైపు దూసుకొస్తున్నాయని వెల్లడించింది.
న్యూఢిల్లీ: భూమిపై అక్టోబర్ 11న మధ్యస్థ స్థాయి భూ అయస్కాంత తుఫాను (Geomagnetic Storm) సంభవించే అవకాశం ఉందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలనా సంస్థ (NOAA) హెచ్చరించింది. సూర్యుడిపై సంభవించిన రెండు భారీ విస్ఫోటనాల కారణంగా సౌర పదార్థాలు భూమి వైపు దూసుకొస్తున్నాయని వెల్లడించింది. వీటి ప్రభావంతో భూ అయస్కాంత తుఫాను ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల ఉపగ్రహాలు, రేడియో సమాచార వ్యవస్థలు, నావిగేషన్ సేవలపై ప్రభావం పడవచ్చని ఎన్‌వోఏఏ పేర్కొంది.
సౌర తుఫాను అంటే..?
సూర్యుడిపై నిరంతరం జరిగే కార్యకలాపాల వల్ల శక్తి, విద్యుదావేశిత కణాలు అంతరిక్షంలోకి విడుదలవుతుంటాయి. వీటిలో భాగంగా సూర్యుడి వెలుపలి వాతావరణం నుంచి ప్లాస్మా, అయస్కాంత క్షేత్రంతో కూడిన భారీ మేఘాలు వెలువడుతాయి. వీటిని కరోనల్ మాస్ ఇజెక్షన్స్ (Coronal Mass Ejections-CMEs) అంటారు. ఇవి భూమిని చేరినప్పుడు భూ అయస్కాంత క్షేత్రంతో పరస్పర చర్య జరిపి అయస్కాంత తుఫాన్లకు కారణమవుతాయి.

అక్టోబర్ 11న ఏం జరగొచ్చు..?
ఎన్‌వోఏఏ అంచనా ప్రకారం.. అక్టోబర్ 7, 8 తేదీల్లో సూర్యుడి నుంచి వెలువడిన రెండు సౌర పదార్థాల మేఘాలు భూమి వైపు ప్రయాణిస్తున్నాయి. రెండో మేఘం వేగంగా కదులుతూ మొదటి మేఘంతో కలిసే అవకాశం ఉంది. దీంతో G-2 స్థాయి మధ్యస్థ భూ అయస్కాంత తుఫాను ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, తుఫాను తీవ్రత భూమి అయస్కాంత క్షేత్రంతో సౌర పదార్థాలు ఎలా పరస్పర చర్య జరుపుతాయనే అంశంపై ఆధారపడి ఉంటుంది.
భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
ఈ తుఫాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో రేడియో సంకేతాలు బలహీనపడవచ్చు. ఉపగ్రహాల పనితీరు, నావిగేషన్ వ్యవస్థల కచ్చితత్వంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. అధిక అక్షాంశ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థల్లో వోల్టేజ్ హెచ్చుతగ్గులు సంభవించే అవకాశం ఉంది. అరోరాలు (ధ్రువ కాంతులు) సాధారణం కంటే తక్కువ అక్షాంశాల వరకు కనిపించవచ్చు. అయితే, భారత్ అంతటా కనిపిస్తాయని చెప్పలేం. అలాగే భారీ విద్యుత్ కోతలు సంభవిస్తాయని, సమాచార వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోతాయని ఎలాంటి హెచ్చరికలు లేవు. ప్రస్తుత అంచనాల ప్రకారం భారత్‌లో సాధారణ జనజీవనానికి పెద్ద ముప్పు ఉన్నట్లు సంకేతాలు కనిపించడం లేదు. సౌర పదార్థాలు భూమిని సమీపించే కొద్దీ తుఫాను తీవ్రతపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి
ఢిల్లీలో ఆంక్షలపై శశి థరూర్ ఆగ్రహం.. ‘ఎమర్-జెన్‌జీ’ అంటూ విమర్శలు
స్కూటీని ఢీకొట్టిన ట్రక్కు.. ప్రాణాలతో బయటపడిన యువతి..