స్కూటీని ఢీకొట్టిన ట్రక్కు.. ప్రాణాలతో బయటపడిన యువతి..
ABN , Publish Date - Oct 10 , 2026 | 03:10 PM
మహారాష్ట్రలో ఓ భయానక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అహిల్యానగర్ జిల్లాలోని శ్రీరాంపూర్-బెలాపూర్ రోడ్డుపై స్కూటీపై వెళ్తున్న యువతిని ఇసుక లోడుతో వెళ్తున్న భారీ ట్రక్కు ఢీకొట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో ఓ భయానక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అహిల్యానగర్ జిల్లాలోని శ్రీరాంపూర్-బేలాపూర్ రోడ్డులో స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి ట్రక్కు చక్రాల కింద పడే పరిస్థితి ఏర్పడింది. అయితే, చివరి క్షణంలో ఆమె ట్రక్కు బంపర్‌ని బలంగా పట్టుకుని వేలాడుతూ ప్రాణాపాయం నుంచి బయటపడింది.
సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. బేలాపూర్‌లోని ప్రధాన రహదారిపై పలు వాహనాలు వెళ్తున్నాయి. అదే సమయంలో ఓ యువతి స్కూటీపై ప్రయాణిస్తోంది. ఇంతలో ఇసుక లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రధాన రహదారిపైకి దూసుకొచ్చి యువతి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నుజ్జునుజ్జయింది. యువతి మాత్రం ట్రక్కు బంపర్‌ను గట్టిగా పట్టుకుని వేలాడటంతో టైర్ల కింద పడిపోకుండా తప్పించుకోగలిగింది. అనంతరం చేతికి గాయమవడంతో పాటు తీవ్ర ఆందోళనకు గురైన ఆమె రోడ్డు పక్కకు నడుచుకుంటూ వెళ్లిపోయింది. యువతి ప్రాణాలతో బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదాన్ని గమనించిన వారంతా ఘటనాస్థలికి చేరుకోవడంతో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ట్రక్కుకు నంబర్ ప్లేట్ కూడా లేకపోవడం గమనార్హం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్షణం ఆలస్యమైనా భారీ ప్రమాదం జరిగి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. యువతి అత్యంత ధైర్యంతో ట్రక్కు బంపర్‌ను పట్టుకుని ప్రాణాలు కాపాడుకుందని ప్రశంసిస్తున్నారు. అయితే, రోడ్ల మలుపుల వద్ద భారీ వాహనాలను నడిపేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు సైతం పెద్ద వాహనాలకు దూరంగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. సముద్రంలో ఏమైందో చూడండి
చిన్నారిని కాపాడేందుకు ఎద్దుతో పోరాటం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో