బైక్ ఇంజిన్ ఆయిల్ మార్చడం లేదా..? నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్యలు తప్పవు!
ABN , Publish Date - Oct 10 , 2026 | 03:15 PM
ఇంజిన్ ఆయిల్ క్రమం తప్పకుండా మార్చకపోతే పలు సమస్యలు ఎదురవుతాయి. అవి ఏంటంటే?
ఇంటర్నెట్ డెస్క్: కొంతమంది వాహనాలకు ఇంజిన్ ఆయిల్ మార్చే విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. సరైన సమయానికి బైక్ సర్వీసింగ్ చేయించరు. దీనివల్ల పలు సమస్యలు ఎదురవుతాయి. ఆయిల్ బైక్ ఇంజిన్‌లోని అంతర్గత భాగాలను లూబ్రికేట్ చేసి, ఘర్షణను నివారిస్తుంది. బైక్‌లను ఎక్కువ కాలం పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకోవాలంటే ఆయిల్‌ను సరైన సమయంలో మార్చి తీరాలి. ఈ విషయంలో ఆలస్యం చేస్తే ఇంజిన్ భాగాలు త్వరగా అరిగిపోతాయి. ఇంజిన్ ఆయిల్ క్రమం తప్పకుండా మార్చకపోతే ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం రండి.
ఇంజిన్ త్వరగా వేడెక్కుతుంది: ఇంజిన్‌లోని వేడిని ఆయిల్ గ్రహిస్తుంది. ఆయిల్ పాతబడే కొద్దీ.. వేడిని గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీని కారణంగా ఇంజిన్ బాగా వేడెక్కుతుంది. ఇలాంటి సమయంలో అది ఒక్కసారిగా ఆగిపోవచ్చు కూడా.
మైలేజీ తగ్గిపోతుంది: క్రమంగా ఆయిల్‌లో నాణ్యత తగ్గడం వల్ల ఇంజిన్‌పై అధిక ఒత్తిడి పడుతుంది. అప్పుడది ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఫలితంగా బైక్ మైలేజ్ గణనీయంగా తగ్గిపోతుంది.
ఇంజిన్ నుంచి శబ్దాలు: ఇంజిన్ ఆయిల్ పాతబడి చిక్కగా, నల్లగా మారితే.. అది అంతర్గత భాగాల మధ్య ఘర్షణను నివారించడంలో విఫలమవుతుంది. దీనివల్ల ఇంజిన్‌లోని భాగాలు రాపిడికి గురై అసాధారణ శబ్దాలు విడుదల చేస్తాయి.
ఇంజిన్ జామ్ అయ్యే ప్రమాదం: ఆయిల్ ఎండిపోయినా లేదా పూర్తిగా అయిపోయినా ఇంజిన్ జామ్ అయ్యే ప్రమాదముంది. ఇలాంటి సందర్భాల్లో ఇంజిన్ మరమ్మతులకు వేల రూపాయలు ఖర్చు చేయాలి. అందుకే సరైన సమయానికి ఆయిల్‌ను మార్చండి. ఈ సమస్యలను నివారించండి.
ఇవీ చదవండి
రైలులోనే మీ వస్తువులు మర్చిపోయారా.. తిరిగి పొందే మార్గం ఇదే..!
మీ బైక్ మైలేజీ తగ్గుతోందా..? అయితే ఈ తప్పులు చేయకండి!