Share News

రైలులోనే మీ వస్తువులు మర్చిపోయారా.. తిరిగి పొందే మార్గం ఇదే..!

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:40 PM

రైలులోనే వస్తువులను మర్చిపోయారా..? తిరిగి పొందడానికి ఇలా చేయండి.

రైలులోనే మీ వస్తువులు మర్చిపోయారా.. తిరిగి పొందే మార్గం ఇదే..!
Indian Railway

ఇంటర్నెట్ డెస్క్: కొందరు ప్రయాణం పూర్తయ్యాక దిగే కంగారులో తమ వస్తువులను రైలులోనే మర్చిపోయి వెళ్లిపోతారు. తీరా గమనించాక ఇక అవి తిరిగిరావని ఆందోళన చెందుతారు. అయితే ఈ వస్తువులను పొందడానికి మార్గాలంటూ లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల కోసం రైల్వే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానిపేరు ‘ఆపరేషన్ అమానత్’. రైలులో ప్రయాణికులు మర్చిపోయిన వస్తువుల ఫొటోలను ఈ కార్యక్రమం కింద రైల్వే అధికారులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. దీని ద్వారా పోయిన మీ వస్తువులు తిరిగిపొందొచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం రండి..!


మొదట ఫిర్యాదు చేయాలి..

  • రైలులో వస్తువులు మర్చిపోయామని తెలిసిన వెంటనే ఫిర్యాదు చేయాలి.

  • రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేసి లేదా అధికారిక ‘రైల్వే మదాద్’ యాప్‌ను ఉపయోగించి ఫిర్యాదు చేయొచ్చు.

  • ఫిర్యాదులో కచ్చితంగా కోచ్ వివరాలు, మర్చిపోయిన వస్తువుల వివరాలను నమోదు చేయాలి.


ఇలాంటి సందర్భాల్లో స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించాలి

  • రైలు దిగిన వెంటనే మీ వస్తువులు మర్చిపోయిన విషయం తెలిస్తే తక్షణమే స్టేషన్ మాస్టర్ లేదా ఆర్‌పీఎఫ్ పోలీసులను సంప్రదించండి.

  • పోగొట్టుకున్న వస్తువుల వివరాలు, ప్రయాణ టికెట్ వారికి అందించండి.

  • ఆర్‌పీఎఫ్ పోలీసులు తదుపరి స్టేషన్‌లోని సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. ఆ సిబ్బంది వస్తువులను స్వాధీనం చేసుకుని, మీకు భద్రంగా అందిస్తారు.


‘ఆపరేషన్ అమానత్’ పోర్టల్‌లో వెతకండి

  • ఆర్పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లో ‘ఆపరేషన్ అమానత్’ విభాగానికి వెళ్లండి.

  • అక్కడ ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువుల ఫొటోలను, వివరాలను ప్రదర్శిస్తారు.

  • వస్తువులను పోగొట్టుకున్న స్టేషన్‌తో పాటు దాని తరువాతి స్టేషన్‌లను ఎంచుకుని చూడడం వల్ల సమయం ఆదా అవుతుంది.


తిరిగి పొందాలంటే..

  • అయితే ‘ఆపరేషన్ అమానత్’ పోర్టల్‌లో మీ వస్తువులు కనిపించిన తరువాత ఆర్‌పీఎఫ్ కార్యాలయానికి వెళ్లాలి.

  • అక్కడ మీ గుర్తింపు కార్డు, ప్రయాణ టికెట్ చూపించాలి.

  • అన్నింటి కంటే ముఖ్యమైనది.. ఆ వస్తువులు మీవేనని రుజువు చేసుకోవడం.

  • ఇందుకోసం వస్తువుల బిల్లు ఉపయోగపడుతుంది. అన్నీ పరిశీలించిన అధికారులు వస్తువులను మీకు తిరిగి ఇస్తారు.


ఇవీ చదవండి

అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ చెకింగ్ డ్రైవ్.. ప్రయాణికులు ఈ పత్రాలను వెంట ఉంచుకోవాల్సిందే!

IRCTC రైలు టికెట్ బుకింగ్‌లో ఈ చిన్న బీమా బాక్స్‌ను మిస్ కాకండి.. రూ.10 లక్షల వరకు కవరేజ్

Updated Date - Oct 04 , 2026 | 05:46 PM