Share News

విభిన్న చిత్రాలు అందించిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Oct 04 , 2026 | 08:51 AM

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.

విభిన్న చిత్రాలు అందించిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు: పవన్ కల్యాణ్

అమరావతి, అక్టోబర్ 04: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి చెందారు. దీంతో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. సింగీతం మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ‘ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు కన్ను మూశారని తెలిసి విచారిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భారతీయ చలన చిత్ర పరిశ్రమకి విభిన్న చిత్రాలు అందించిన దర్శకుడాయన. పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మయూరి, ఆదిత్య 369, మైకేల్ మదన కామరాజు లాంటి చిత్రాల్లో సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన ప్రయోగాలు, చూపిన సృజన ప్రేక్షకులను మెప్పించాయి’.


‘ఆయన రూపొందించిన అమెరికా అమ్మాయి, పంతులమ్మ లాంటి చిత్రాల్లోని గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 94 ఏళ్ల వయసులోనూ సింగ్ గీతం అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయనకి సినిమా పట్ల ఉన్న ఆసక్తిని తెలియచేసింది. సింగీతం శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


దేశవిదేశాల్లోని జాతీయవాదులను ప్రేరేపించిన శ్యామ్‌జీ: డిప్యూటీ సీఎం

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ జాతీయవాద నాయకుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ జయంతి నేడు. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘనంగా నివాళులర్పిస్తూ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ‘జాతి స్ఫూర్తిని మసకబారనివ్వని వారే స్వేచ్ఛను ముందుకు తీసుకువెళతారు. భారతదేశ స్వాతంత్ర్యం పట్ల తన అంకితభావంతో భారతదేశంలోనూ, విదేశాలలోనూ జాతీయవాదులను ప్రేరేపించిన ధైర్యవంతుడైన దేశభక్తుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం’.


‘ఇండియా హౌస్, ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ ద్వారా ఆయన స్వయం పరిపాలన ఉద్యమాన్ని భారతదేశ సరిహద్దులు దాటించి, స్వేచ్ఛ కోసం నిలబడటానికి ఒక తరాన్ని ప్రేరేపించారు. ధైర్యం సరిహద్దులను దాటగలదని, ఆలోచనలు తరతరాలను ప్రేరేపించగలవని, స్వేచ్ఛా స్ఫూర్తిని ఎన్నటికీ బంధించలేమని ఆయన జీవితం మనకు గుర్తుచేస్తుంది. ఈ గొప్ప దేశభక్తునికి, స్వాతంత్ర్య సమరయోధునికి నా గౌరవపూర్వక నివాళులు’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పార్లమెంటరీ కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు ప్రాధాన్యం

అమ్మి సొమ్ము చేసుకునేందుకే చోరీ

Updated Date - Oct 04 , 2026 | 09:29 AM