Share News

అమ్మి సొమ్ము చేసుకునేందుకే చోరీ

ABN , Publish Date - Oct 04 , 2026 | 07:22 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 20 మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అమ్మి సొమ్ము చేసుకునేందుకే చోరీ
Malkajgiri police

  • ఆర్మీ ఆయుధాలను కోల్‌కతాలో విక్రయించేందుకు మల్లేశ్‌ ఒప్పందం..

  • అక్కడున్న ఇద్దరితో అంతకుముందే డీల్‌

  • చోరీలో అతడికి సహకరించిన స్నేహితులు, ఆర్మీ ఉద్యోగులు

  • వారికి అడ్వాన్సుగా లక్ష ఇచ్చిన మల్లేశ్‌..

  • ఆయుధాలను అమ్మిన తర్వాత వాటాలిస్తానని హామీ

  • వివరాలు వెల్లడించిన మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి

  • 8 మొత్తం 8 మంది నిందితుల అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 20 మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు, మాజీ హవిల్దార్‌ మల్లేశ్‌ను పోలీసులు విచారించిన క్రమంలో మరో ఏడుగురు నిందితుల పాత్ర ఉన్న ట్లు తేలింది. తాజాగా వారందరినీ అరెస్టు చేశారు. వారిలో కోల్‌కతాకు చెందిన ఇద్దరు పాత నేరస్థులు బీర్బల్‌షా, అవిదే అలియాస్‌ ఓబీతో పాటు.. ముగ్గురు ఆర్మీ అధికారులు శేషు, వినోద్‌, ప్రవీణ్‌, మల్లేశ్‌ స్నేహితులు మల్లికార్జున్‌, నిరంజన్‌ ఉన్నారు. వీరందరినీ శనివారం రిమాండ్‌కు తరలించారు.


ఈ నేపథ్యంలో, సికింద్రాబాద్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి. సుమతి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉప్పుతొల్ల మల్లేశ్‌ అలియాస్‌ రాజు 2010లో ఆర్మీలో చేరారు. మేఘాలయ, ఊటీ, షిల్లాంగ్‌, కోల్‌కతా బ్యారక్‌పూర్‌ కంటోన్మెంట్‌ సహా పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా పలుమార్లు ఉన్నతాధికారుల నుంచి క్రమశిక్షణ చ ర్యలు ఎదుర్కొన్నాడు. మల్లేశ్‌కు గతంలో నేర చరిత్ర ఉంది. 2005లో అచ్చంపేట, 2007లో ఆమ్రాబాద్‌ పరిధిలో చోరీ కేసులు నమోదయ్యాయి. స్థానికంగా రాజు అనే పేరుతో చెలామణి అయ్యేవాడు.


మల్లేశ్‌ అనే పేరుతో 2010లో ఆర్మీలో చేరడంతో ఈ నేర చరిత్ర అప్పట్లో బయటపడలేదు. 2022లో కోల్‌కతా బ్యారక్‌పూర్‌లో పనిచేస్తున్న క్రమంలో కంటోన్మెంట్‌ బెటాలియన్‌ బయట చెరకు రసం విక్రయించే బీర్బ ల్‌ షాతో మల్లేశ్‌కు పరిచయం ఏర్పడింది. ఓ చిన్నస్థాయి రాజకీయ కార్యకర్త అయిన అవిదే అలియాస్‌ ఓబిని మల్లేశ్‌కు బీర్బల్‌షా పరిచయం చేశాడు. ఈ పరిచయాలతో రూ.10 వేలు చెల్లించి ఒక కంట్రీమేడ్‌ తుపాకీని మల్లేశ్‌ కొన్నాడు. దాంతో అమాయకులను బెదిరించి దారి దోపిడీ చేద్దామని చూశాడుగానీ సాధ్యం కాలేదు. ఆ తుపాకీని అచ్చంపేట సాయినగర్‌ కాలనీలోని తన తండ్రి ఇంట్లో దాచిపెట్టాడు. 2025 జూన్‌లో హైదరాబాద్‌ బొల్లారం 20 మద్రాస్‌ ఆర్మీ రెజిమెంట్‌కు బదిలీపై వచ్చాడు.


సూడాన్‌ వెళ్లాలనే ఆశలు ఆవిరి

మూడేళ్ల తర్వాత రిటైర్మెంట్‌ అనంతరం సూడాన్‌ వెళ్లి అక్కడ ఆర్మీలో చేరి, బాగా సంపాదించాలని మల్లేశ్‌ ప్రణాళికలు వేసుకున్నాడు. అయితే, విధుల్లో నిర్లక్ష్యం, అనారోగ్య సమస్యలతో అధికారులు మరో మూడేళ్లు సర్వీస్‌ మిగిలి ఉండగానే మల్లేశ్‌ను ఉద్యో గం నుంచి తొలగించారు. దీంతో సుడాన్‌ ఆశలు కల్లలయ్యాయి. డబ్బుల కోసం తన స్నేహితులు మల్లికార్జున్‌, నిరంజన్‌తో కలిసి బ్యాంకుల్లో, బంగారు దుకాణాల్లో దోపిడీలు చేయాలని పథకం వేశాడు. కానీ అతడి స్నేహితులు ఒప్పుకోలేదు.


దీంతో కోల్‌కతాలోని బీర్బల్‌షా, అవిదే అలియాస్‌ ఓబితో మాట్లాడి.. ఆర్మీ ఆయుధాలు చోరీ చేసి తెస్తానని, వాటిని తీసుకొని డబ్బులివ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆర్మీ ఆయుధాల చోరీతో డబ్బులు సంపాదించటంతోపాటు, తనను సర్వీసులోంచి తొలగించిన అధికారులకు చెడ్డపేరు తీసుకురావచ్చని భావించాడు. బెటాలియన్‌లో ఉండే తన స్నేహితు డు శేషు, ఆయుధాల నిల్వ కేంద్రం (కోటె) ఇన్‌చార్జి వినోద్‌ను సంప్రదించి తనకు సహకరించాలని పేర్కొంటూ రూ.ఒక లక్ష అడ్వాన్స్‌ ఇచ్చాడు. మద్రాస్‌ 16 ఆర్మీ బెటాలియన్‌లో పనిచేస్తున్న తన బ్యాచ్‌మెట్‌ ప్రవీణ్‌తో చోరీకి సంబంధించిన విషయాలు పంచుకునేవాడు.


అతని సలహాలు తీసుకునేవాడు. ఆయుధాలు అమ్మిన తర్వాత వచ్చే డబ్బులో వాటా ఇస్తానని వీళ్లందరినీ ఒప్పించాడు. అలా వారి సహకారంతో ఆగస్టు 30వ తేదీ రాత్రి ఆయుధాలు చోరీ చేశాడు. వెంటనే శేషుకు విషయం చెప్పాడు. స్నేహితుడు ప్రవీణ్‌కు ‘కామ్‌ హోగయా బాయ్‌’ అని వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టాడు. ఆయుధాలను కారులో నాగకర్నూల్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి గడ్డివాములో దాచిపెట్టాడు. ఆ తర్వాత ఆయుధాలను కోల్‌కతాకు తరలించి బీర్బల్‌షా, ఓబీకి అమ్మాలన్నది మల్లేశ్‌ ప్రణాళిక. కానీ, ఈలోపే పోలీసులకు దొరికిపోయి, అతడి వెనుక ఉన్న వారి పాత్ర కూడా బయటపడింది. అవిదేను విచారించిన క్రమంలో అతను ఒక పాత నేరస్థుడని తేలింది. కాగా బీర్బల్‌ షాకు, మల్లేశ్‌ స్నేహితుల్లో ఒకడైన జవాన్‌ శేషుకు పాకిస్థాన్‌ పోర్న్‌ (అశ్లీల, శృంగార) సైట్లతో లింకులు ఉన్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు. వాటిలో ఎలాంటి ఉ గ్రవాద లింకులు లేవని స్పష్టం చేశారు. తదుపరి వి చారణలో భాగంగా నిందితులను మరోసారి కస్టడీకి తీసుకొని విచారిస్తామని సీపీ సుమతి తెలిపారు.

Updated Date - Oct 04 , 2026 | 07:29 AM