బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నాం: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:45 PM
బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 10: బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది తెలుగుదేశం పార్టీ స్పష్టమైన విధానమని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం కారణంగా సుమారు 16,800 మంది బీసీలు తమ రాజకీయ పదవులను కోల్పోయారని విమర్శించారు. బీసీలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, వారి హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీల రిజర్వేషన్ల అంశంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, గతంలో తీసుకున్న నిర్ణయాలకు వారే సమాధానం చెప్పాలని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.
మరోవైపు.. రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.12,500 కోట్ల ఆర్థిక సంఘం నిధులను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి, స్థానిక సంస్థల బలోపేతానికి ఈ నిధులు కీలకమని పేర్కొంటూ, నిధుల విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని.. వాటి కార్యకలాపాలు నిర్వీర్యమై కనీస సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంపొందించడం, వారి హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ ప్రాధాన్యాల్లో భాగమని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎల్‌నినో ప్రభావం.. 2027 నాటికి భారత్‌లో వంటనూనెల కొరత..
భారత మూలాలున్న మహిళలకు నోబెల్ శాంతి పురస్కారం