ఇది కదా బిజినెస్ అంటే.. చిన్న ఐడియాతో లక్షలు సంపాదిస్తున్న మహిళ
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:10 PM
చైనాలోని ఒక నగరంలో ఓ మహిళ ఏకంగా 196 పార్కింగ్ స్థలాలు కొనేశారు. ఇప్పుడు పార్కింగ్ ఛార్జీలు అమాంతం పెంచేసి నెలనెలా లక్షలు సంపాదిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మహిళలు ఎక్కువగా బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారు. కానీ చైనాకు చెందిన ఓ మహిళ ఒకేసారి 196 పార్కింగ్ స్థలాలను కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి వల్ల ఆమెకు నెలనెలా లక్షల్లో లాభాలు వస్తున్నాయి. ఆ దేశంలోని హునాన్ ప్రావిన్స్‌లో చాంగ్షా నగరం ప్రస్తుతం అభివృద్ధిలో దూసుకుపోతోంది. 2018లో మాత్రం అక్కడ మౌలిక వసతులు అంతగా లేవు. ఆ సమయంలో చాంగ్షాలో భూమి ధరలు తక్కువగానే ఉన్నాయి. ఇలాంటి చోట పెట్టుబడులు పెడితే బావుంటుందని వూ అనే మహిళ భావించారు. అందుకే 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 కోట్లు) పెట్టి అప్పట్లో 196 పార్కింగ్ స్థలాలు కొనేశారు.
ఇప్పుడక్కడ పార్కింగ్ స్పేస్‌లకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్‌ను క్యాష్‌గా మార్చుకుంటున్నారు వూ. ఒక్కసారిగా పార్కింగ్ ఛార్జీలను రెండింతలు పెంచేశారామే. నెలవారీ పార్కింగ్ ఛార్జీలను వూ రూ.7258లకు పెంచేశారు. ఇది విన్న వాహనదారులకు గుండెల్లో రాయిపడినట్టైంది. ఈ ఛార్జీలను 4 వేలకు తగ్గించాలని వారు విన్నవించారు. దానికి ఆ మహిళ ఏమాత్రం అంగీకరించలేదు. దీంతో వాహనదారులు స్థానిక కోర్టును ఆశ్రయించారు. వూ ఒకేసారి అన్ని పార్కింగ్ ప్రదేశాలనూ కొనుగోలు చేసి, దారుణంగా రేట్లు పెంచేశారని వారు వాపోయారు. ఇక్కడి మోనోపోలీ (మార్కెట్ అంతా ఒకరి చేతుల్లో ఉండడాన్ని ఇలా వ్యవహరిస్తారు)ని రద్దు చేయాలని కోరారు.
2024 ఫిబ్రవరిలో ఈ కేసుపై చాంగ్షా స్థానిక కోర్టు ఆ మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఒకేసారి అన్ని పార్కింగ్ స్పేస్‌లనూ కొనుగోలు చేయడం ఏ విధంగానూ నేరం కాదని పేర్కొంది. ఒక వ్యక్తి ఎన్ని పార్కింగ్ ప్రదేశాలైనా కొనవచ్చని, దానిపై ఎలాంటి చట్ట పరిమితి లేదని వ్యాఖ్యానించింది.
ఈ వార్తలూ చదవండి
విద్యార్థి గుండుపై తబలా వాయించిన ఉపాధ్యాయుడు.. చివరికి ఏమైందంటే..
61 ఏళ్ల వయసులో మహిళ ప్రపంచ రికార్డు.. 5 గంటల పాటు ప్లాంక్