Share News

విద్యార్థి గుండుపై తబలా వాయించిన ఉపాధ్యాయుడు.. చివరికి ఏమైందంటే..

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:14 PM

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే సోషల్ మీడియా మోజులో విచిత్రమైన చర్యకు పాల్పడ్డాడు. ఓ విద్యార్థి గుండు చేయించుకోగా.. అతని తలను తబలాలా వాయించాడు. దానిని వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

విద్యార్థి గుండుపై తబలా వాయించిన ఉపాధ్యాయుడు.. చివరికి ఏమైందంటే..
Uttar Pradesh Teacher Video

ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే సోషల్ మీడియా మోజులో విచిత్రమైన చర్యకు పాల్పడ్డాడు. ఓ విద్యార్థి గుండు చేయించుకోగా.. అతని తలను తబలాలా వాయించాడు. దానిని వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విషయం విద్యాశాఖ దృష్టికి వెళ్లడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థి, ఉపాధ్యాయుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా బిరౌలీ ప్రాథమిక పాఠశాలకు ఓ విద్యార్థి ఇటీవల గుండు చేయించుకుని వచ్చాడు. ఆ చిన్నారి తలపై జుట్టు లేకపోవడాన్ని గమనించిన ఉపాధ్యాయుడు దినేశ్ కుమార్ మాథుర్.. ఆ బాలుడిని తన దగ్గరకు పిలిచాడు. ఆయన కుర్చీలో కూర్చొని ఉండగా, బాలుడిని తన ముందు మోకాళ్లపై కూర్చోబెట్టుకున్నాడు. అనంతరం చిన్నారి తలను తబలాలా వాయించాడు. పిచ్చిపట్టినట్లు నవ్వుతూ, ఎంతో హుషారుగా బాలుడి తలపై కొట్టాడు. దీనికి చుట్టూ ఉన్న విద్యార్థులంతా కేరింతలు కొడుతూ నవ్వగా.. ఉపాధ్యాయుడు మరింత రెచ్చిపోయాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఈ తతంగాన్నంతా వీడియో తీశాడు.


అనంతరం దినేశ్ కుమార్ తన ఫేస్‌బుక్ ఖాతాలో వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఉపాధ్యాయుడి ప్రవర్తనపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పిల్లలతో సరదాగా ఉండటం తప్పు కాదని, అయితే వారి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలని పలువురు నెటిజన్లు హితవు పలికారు. అంతమంది విద్యార్థుల మధ్య ఓ బాలుడిని నవ్వులపాలు చేసేలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని మరికొందరు ప్రశ్నించారు.


ఈ ఘటనపై జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ అధికారి డాక్టర్ రాజేశ్ కుమార్ స్పందించారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనను క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించి తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకూ ఆదేశించారు. దీంతో ఈ ఘటన స్థానికంగా పెద్దఎత్తున చర్చకు దారితీసింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఎల్‌నినో ప్రభావం.. 2027 నాటికి భారత్‌లో వంటనూనెల కొరత..

భారత మూలాలున్న మహిళలకు నోబెల్ శాంతి పురస్కారం

Updated Date - Oct 09 , 2026 | 04:15 PM