పదేళ్ల తర్వాత జట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:45 PM
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ నిక్ మాడిసన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చి..
స్పోర్ట్స్ డెస్క్: చాలా కాలం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ప్లేయర్.. చక్కటి ప్రదర్శన చేసి గుర్తింపు పొందాలని చూస్తారు. కానీ ఓ ప్లేయర్ మాత్రం దాదాపు దశాబ్ద కాలం తర్వాత జట్టులోకి వచ్చి ఓ చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ నిక్ మాడిసన్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన నిక్ మాడిసన్ 33 బంతులాడి పరుగులు ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో టెస్టు చరిత్రలో నిక్ మాడిసన్‌ది బంతుల పరంగా మూడో లాంగెస్ట్ డకౌట్ కావడం గమనార్హం.
నిక్ మాడిసన్ కంటే ముందు న్యూజిలాండ్ ఓపెనర్ డారిన్ ముర్రే తొలి స్థానంలో ఉన్నాడు. అతడు 1995లో శ్రీలంకతో జరిగిన టెస్టులో 39 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. రెండో స్థానంలో జింబాబ్వే ఓపెనర్ ట్రెవర్ గ్రిప్పర్ (36 బంతుల్లో డకౌట్, 2000 మార్చిలో వెస్టిండీస్‌పై) ఉన్నాడు. తాజాగా నిక్ మాడిసన్ 33 బంతుల్లో డకౌటయ్యి మూడో స్థానంలో నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో జింబాబ్వే ఓపెనర్ మార్క్ డెక్కర్ (30 బంతుల్లో) ఉన్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ బ్రియాన్ లక్ హర్ట్స్ (29 బంతుల్లో డకౌట్) ఐదో స్థానంలో ఉన్నాడు.
ఆస్ట్రేలియా తరఫున తొలిస్థానంలో...
ఇక ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యంత ఎక్కువ బంతులు ఆడి డకౌట్ అయిన ఓపెనర్‌గా మాత్రం నిక్ మాడిసన్ నిలిచాడు. గతంలో 2022లో హోబర్ట్ వేదికగా జరిగిన టెస్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (22 బంతుల్లో డకౌట్) ఇప్పటివరకు సుదీర్ఘ డకౌట్‌గా ఉండేది. తాజాగా వార్నర్ చెత్త రికార్డును నిక్ మాడిసన్ ఏకంగా 11 బంతుల తేడాతో బ్రేక్ చేశాడు. మాడిసన్ చివరిసారిగా 2016లో పాకిస్థాన్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా తరపున టెస్ట్ ఆడాడు.
మాడిసన్ ఏడాదికి పైగా ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడకున్నా... జాతీయ జట్టుకు అతడి ఎంపిక ఆశ్చర్యం కలిగించింది. సరిగ్గా 18 నెలల క్రితం అతడు క్యాన్సర్‌కు కీమోథెరపీ చేయించుకున్నాడు. మాడిసన్ ఎంపికపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ, టాస్ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. ఆ సీనియర్ బ్యాటర్‌ను ప్రశంసించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. 36 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి 107 పరుగులు చేసింది. ముల్డర్, మార్కో చెరో రెండు వికెట్లు తీశారు.
ఈ వార్తలనూ చదవండి:
61 ఏళ్ల వయసులో మహిళ ప్రపంచ రికార్డు.. 5 గంటల పాటు ప్లాంక్
ఏఐని నమ్మి కొండెక్కాడు.. మధ్యలో షాకింగ్ ట్విస్ట్..