ఐపీఎల్ 2026: ముంబై పతనం.. హార్దిక్ కెప్టెన్సీపై పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - May 25 , 2026 | 05:00 PM
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఘోర ప్రదర్శనపై ఆ జట్టు కోచ్ కీరన్ పొలార్డ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు అన్ని అవకాశాలిచ్చామని, కానీ అతడు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. ఈ ఐపీఎల్ సీజన్లో ఘోర ప్రదర్శనతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ముంబై లీగ్ దశలోనే నిష్క్రమించడంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024లో ఎంఐ బాధ్యతలు చేపట్టిన హార్దిక్.. రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు జట్టును చేర్చడంలో విఫలమయ్యాడు. దీంతో అతడి కెప్టెన్సీ భవితవ్యంపై సందేహాలు రేకెత్తుతుండగా.. తాజాగా ఆ జట్టు కోచ్ కీరన్ పొలార్డ్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఓటమి అనంతరం పొలార్డ్ మాట్లాడుతూ.. 'హార్దిక్ కెప్టెన్సీ ఆశించిన స్థాయిలో లేదు. యాజమాన్యం కోరుకున్న ఫలితాలు రాలేదు. అతడికి జట్టును విజయవంతంగా నడిపించేందుకు అవసరమైన అన్ని అవకాశాలు ఇచ్చాం. కానీ అతను ఆశించిన మేర రాణించలేకపోయాడు' అని పొలార్డ్ అన్నాడు. అయితే.. ఈ ఓటములకు హార్దిక్ ఒక్కడినే కారణంగా భావించలేమని పొలార్డ్ పేర్కొన్నాడు. జట్టంతా కలసికట్టుగా ప్రయత్నించిందని.. ఆటలో గెలుపోటములు సహజమని, ఎవరినీ వేలెత్తి చూపే పరిస్థితి లేదని చెప్పుకొచ్చాడు. హార్దిక్ కూడా తనవంతు ప్రయత్నంచేశాడని, కానీ ఫలితాలు అనుకూలంగా రాలేదని అంగీకరించాడు.
ఇక.. జట్టులో మార్పులేమైనా ఉంటాయా అనే ప్రశ్న ఎదురవగా.. భావోద్వేగ నిర్ణయాలు తీసుకునేందుకు ఇది సమయం కాదని పొలార్డ్ సమాధానమిచ్చాడు. టీమ్ మేనేజ్మెంట్ అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నాడు. కాగా వెన్నునొప్పి కారణంగా 4 మ్యాచ్‌లకు దూరమైన పాండ్యా.. 10 ఇన్నింగ్స్‌లో కలిపి 206 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ తీవ్రంగా నిరాశపరుస్తూ కేవలం 4 వికెట్లే తీయగలిగాడు. పాండ్యాతో పాటు ప్రధాన ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా తేలిపోవడం ముంబై ఇండియన్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
ఇవీ చదవండి:
ఫిఫా ప్రపంచ కప్‌నకు ముందు గాయపడ్డ మెస్సి!
ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!