ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!
ABN , Publish Date - May 25 , 2026 | 09:25 AM
పంజాబ్ కింగ్స్.. తొలి 7 మ్యాచుల్లో ఓటమే లేదు.. టేబుల్ టాపర్. భీకరమైన బ్యాటింగ్ ఆర్డర్.. విజృంభిస్తున్న బౌలర్లు. ఇంకేముంది.. ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకునే తొలి టీమ్‌గా మారుతుందని భావించారంతా! కానీ సీన్ రివర్స్ అయింది.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ కింగ్స్.. తొలి 7 మ్యాచుల్లో ఓటమే లేదు.. టేబుల్ టాపర్. భీకరమైన బ్యాటింగ్ ఆర్డర్.. విజృంభిస్తున్న బౌలర్లు. ఇంకేముంది.. ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకునే తొలి టీమ్‌గా మారుతుందని భావించారంతా! కానీ సీన్ రివర్స్ అయింది. ఆ తర్వాత గెలుపే కరవైంది. టోర్నీ సెకండాఫ్‌లో వరుసగా ఆరు ఓటములు ఎదురయ్యాయి. వాహ్వా పంజాబ్ అని ప్రశంసించిన నోళ్లే.. ‘పాపం.. పంజాబ్’ అనేలా తయారైంది జట్టు పరిస్థితి. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో గెలిచినా.. దురదృష్టం వెంటాడింది. చివరికి ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. ‘తొలి కప్పు’ కల.. కలలాగే మిగిలిపోయింది.
గతేడాది ఫైనలిస్ట్ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. ప్రత్యర్థులు వణికిపోయేలా విజయాలు నమోదు చేసింది. కేకేఆర్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. వరుసగా ఆరు మ్యాచుల్లో గెలిచి ‘తొలి కప్పు’ కలను నెరవేర్చుకునేలా కనిపించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. దూకుడుగా ఆడటమే కాకుండా జట్టును నడిపించిన తీరు ఆకట్టుకుంది. కానీ రెండో స్టేజ్ మొదలైన తర్వాత పంజాబ్ కింగ్స్‌కు అసలైన సవాల్ ఎదురైంది. తొలుత విజయాలు వరించినా.. ఆ తర్వాత గెలుపు కనీసం పలకరించేందుకు కూడా అవకాశం లేకపోయింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది. కానీ.. ముంబైపై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందడంతో పంజాబ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.
ఆ ఒక్క పోస్ట్ చేయకుండా ఉండాల్సింది..
ఈ సీజన్‌లో అత్యధికంగా 200+ స్కోర్లు ఇచ్చిన జట్టు పంజాబ్ కింగ్సే. అలాగే ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోరును ఛేదించిన జట్టూ పంజాబే. ఢిల్లీపై ఏకంగా 265 పరుగుల టార్గెట్‌ను ఛేదించి విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచుల్లోనూ 250+ స్కోర్లు చేసిన టీమ్‌గానూ అవతరించింది. కానీ, ఎప్పుడైతే రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి ఎదురైందో.. ఇక కోలుకోలేదు. వరుస పరాభవాలతో కుదేలైంది. మరో హోం గ్రౌండ్ ధర్మశాలలో ఆడిన ప్రతి మ్యాచ్ ఓడిపోయింది. రాజస్థాన్‌తో మ్యాచ్ సమయంలో పంజాబ్ పెట్టిన ఓ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆర్సీబీ ఆల్‌టైమ్ అన్‌వాంటెడ్ రికార్డు 49 ఆలౌట్‌ను ట్రోల్ చేస్తూ ఎక్స్ ఖాతాలో పంజాబ్ పోస్ట్ పెట్టింది. ఆర్సీబీని ట్రోల్ చేయడం వల్లే పంజాబ్‌కు ఈ దుస్థితి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. ఒక్క పోస్ట్ చేయకుండా ఉండాల్సిదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
చెత్త ఫీల్డింగ్..
చాహల్, అర్ష్‌దీప్ సింగ్, యాన్సెన్.. వంటి అద్భుతమైన బౌలర్లు పంజాబ్ సొంతం. ఫస్టాఫ్‌లో ఉన్న ప్లేయర్లే సెకండాఫ్‌లోనూ ఉన్నారు. కానీ ఫీల్డింగ్, బౌలింగ్‌లో పంజాబ్ గతి తప్పింది. అర్ష్‌దీప్, ఫెర్గుసన్, యాన్సెన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో పంజాబ్ ఏకంగా 20కి పైగా క్యాచ్‌లు జారవిడిచింది. పంజాబ్ ఓడిపోవడంలో ఇవే అత్యంత కీలక పాత్ర పోషించాయి. కీలక సమయంలో విధ్వంసకర బ్యాటర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఫామ్ కోల్పోయారు. ఇది కూడా జట్టుపై ప్రభావం చూపింది. ఆఖరి మ్యాచ్‌లో శ్రేయస్.. ఐపీఎల్‌లోనే తొలి సెంచరీని నమోదు చేసి జట్టును విజయతీరాలకు చేర్చినా.. అదృష్టం కలిసి రాలేదు. 15 పాయింట్లతో లీగ్ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. పంజాబ్ కింగ్స్ జట్టు.. 16 సీజన్లలో లీగ్ దశలోనే ఇంటి బాట పట్టగా.. 2008లో సెమీస్, 2014, 2025లో రన్నరప్‌గా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
ముంబైతో మ్యాచ్‌కు ఫిట్‌గా లేను.. కానీ బరిలోకి దిగా: రియాన్ పరాగ్
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ