Share News

కోహ్లీతో షేక్‌హ్యాండ్ వివాదం.. ట్రావిస్ హెడ్ భార్యకు వేధింపులు!

ABN , Publish Date - May 25 , 2026 | 10:20 AM

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం ఊహించని మలుపు తిరిగింది. కొందరు అభిమానులు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికపై ఆన్‌లైన్‌లో వేధింపులకు పాల్పడ్డారు.

కోహ్లీతో షేక్‌హ్యాండ్ వివాదం.. ట్రావిస్ హెడ్ భార్యకు వేధింపులు!
Jessica Head

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కోహ్లీ.. హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వివాదం ఊహించని మలుపు తిరిగింది. కొందరు అభిమానులు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికపై ఆన్‌లైన్‌లో వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని జెస్సికనే స్వయంగా వెల్లడించారు.


‘వన్డే ప్రపంచ కప్ 2023 తర్వాత ఎదురైన పరిస్థితులు మళ్లీ గుర్తొస్తున్నాయి. మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు సోషల్ మీడియా మొత్తం అసభ్యకర పదజాలంతో నిండిపోయింది. నన్ను, నా స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. క్రీడల్లో అభిమానం, ఉద్వేగం సహజం. కానీ క్రీడాకారులకు కూడా కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. క్రీడాకారుల ఫ్యామిలీ కూడా మనుషులే. ఆట ముగిసిన తర్వాత పరస్పరం గౌరవించుకోవాలి.. ఇలా ప్రవర్తించడం సరికాదు’ అని జెస్సిక ఆవేదన వ్యక్తం చేశారు.


కోహ్లీ-హెడ్ మధ్య ఏం జరిగిందంటే..

ఉప్పల్ వేదికగా ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ జట్లు చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడేశాయి. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పెద్దగా రాణించలేదు. 11 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మధ్యలోనే విరాట్, హెడ్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ‘భారీ షాట్లు కొట్టు..’ అంటూ కోహ్లీని రెచ్చగొట్టేలా హెడ్ వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. కోహ్లీ కూడా ఘాటుగా స్పందిస్తూ.. ‘నువ్వు వచ్చి ఆఫ్ స్పిన్ వేయ్.. అప్పుడు భారీ షాట్లు కొడతా. అయినా నువ్వు ఎప్పుడూ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వస్తావు కదా’ అంటూ ఫైరయ్యాడు. ఆ తర్వాత కరచాలనం చేస్తున్నప్పుడు విరాట్.. హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. కాగా, ప్లే ఆఫ్స్‌కు ఇప్పటికే అర్హత సాధించిన బెంగళూరు, హైదరాబాద్ జట్లు మళ్లీ ఈ సీజన్‌లో తలపడే అవకాశం ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి:

ముంబైతో మ్యాచ్‌కు ఫిట్‌గా లేను.. కానీ బరిలోకి దిగా: రియాన్ పరాగ్

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ

Updated Date - May 25 , 2026 | 10:20 AM