Share News

బుమ్రా కాదు.. భువీ బౌలింగ్ అత్యంత ప్రమాదకరం: కివీస్ మాజీ క్రికెటర్

ABN , Publish Date - Oct 21 , 2026 | 05:05 PM

న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్.. భువీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా కంటే భువీ బౌలింగ్ అత్యంత ప్రమాదకరమని అభిప్రాయపడ్డాడు.

బుమ్రా కాదు.. భువీ బౌలింగ్ అత్యంత ప్రమాదకరం: కివీస్ మాజీ క్రికెటర్
Bhuvneshwar Kumar, Jasprit Bumrah

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కీలకంగా మారే అవకాశం ఉంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత భువీ రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం జరగనుంది. దీనికి ముందు న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్.. భువీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా కంటే భువీ బౌలింగ్ అత్యంత ప్రమాదకరమని అభిప్రాయపడ్డాడు.


‘భువనేశ్వర్ కుమార్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావడం సంతోషంగా ఉంది. అతడు గొప్ప బౌలర్. ఐపీఎల్‌లో చాలాకాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టులో అతడుంటే బౌలింగ్‌ విభాగానికి కాస్త ప్రశాంతత లభిస్తుంది. కీలక సమయాల్లో బౌలింగ్‌ చేసిన అనుభవం అతడికి ఉంది. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో కెప్టెన్‌తో కలిసి అతడి అనుభవాన్ని ఉపయోగించుకోవచ్చు. కొత్త బంతితో స్వింగ్‌, సీమ్‌ లభిస్తే బుమ్రా కంటే భువీనే అత్యంత ప్రమాదకరంగా బౌలింగ్ చేయగలడు. ఈ సిరీస్‌ ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలంగా ఉండొచ్చు. సరైన లెంగ్త్‌లో బౌలింగ్‌ చేస్తూ బంతిని స్వింగ్‌ చేయగలిగితే బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు’ అని బాండ్ వెల్లడించాడు.


యువ బౌలర్లకు మంచి అవకాశం

‘2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌కు ఈ సిరీస్‌ భారత యువ ఫాస్ట్‌ బౌలర్లకు ఉపయోగపడుతుంది. ప్రిన్స్‌ యాదవ్‌ వంటి యువ బౌలర్లు ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నారు. న్యూజిలాండ్‌ పరిస్థితుల్లో ఆడటం, అక్కడి వాతావరణానికి అలవాటు పడటం భవిష్యత్తులో వారికి ఉపయోగపడుతుంది. న్యూజిలాండ్‌లోని చల్లని వాతావరణం, గాలులు, పిచ్‌లపై బౌన్స్‌ భారత ఆటగాళ్లకు సవాలుగా మారవచ్చు. ముఖ్యంగా స్వదేశంలో సిరీస్‌ ఆడిన వెంటనే అక్కడికి వెళ్లిన భారత బ్యాటర్లు పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంటుంది. మరోవైపు పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలిస్తే భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. ప్రేక్షకులకు ఆసక్తికరమైన పోటీ లభించనుంది’ అని బాండ్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి..

ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 21 , 2026 | 05:06 PM