ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..
ABN , Publish Date - Oct 21 , 2026 | 07:27 AM
అణు కార్యక్రమం విషయంలో అమెరికాకు ఇరాన్ మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. శుద్ధి చేసిన యురేనియంలో కొంత భాగాన్ని కూడా ఇతర దేశాలకు తరలించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. అది తమ దేశ ప్రజల జాతీయ సంపద అని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అణు కార్యక్రమం విషయంలో అమెరికాకు ఇరాన్ మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. శుద్ధి చేసిన యురేనియంలో కొంత భాగాన్ని కూడా ఇతర దేశాలకు తరలించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. అది తమ దేశ ప్రజల జాతీయ సంపద అని స్పష్టం చేసింది. అమెరికాతో శాంతి చర్చలు జరగాలంటే ముందుగా తమ షరతులను అంగీకరించాలని డిమాండ్ చేసింది. పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ మంగళవారం టెహ్రాన్‌లో పర్యటించారు (Iran Nuclear Deal).
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఇరాన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహసేన్ రెజాయీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుద్ధి చేసిన అణు పదార్థంలో ఒక్క గ్రామును కూడా దేశం వెలుపలకు పంపించబోమని స్పష్టం చేశారు. ఆ పదార్థాలు ఇరాన్ ప్రజల జాతీయ సంపద అని, వాటిని దేశ అవసరాల కోసమే వినియోగిస్తామని పేర్కొన్నారు (Iran Enriched Uranium).
అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా కఠిన వైఖరిని ప్రదర్శించారు (Iran US Tensions). బెదిరింపుల మధ్య చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికా ముందుగా తమ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతోపాటు సైనిక బెదిరింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తమ దేశం విధించిన ఏడు షరతులను అమెరికా నెరవేర్చాల్సిందేనని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు. పశ్చిమాసియా వ్యాప్తంగా కాల్పుల విరమణ, విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తుల విడుదల, చమురు రంగంపై ఆంక్షల తొలగింపు వంటి అంశాలపై ఇరాన్ పట్టుదలగా ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు.. బైకర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్
కశ్మీర్లో పురాతన శివలింగం పునరుద్ధరణ.. పోటెత్తుతున్న భక్తులు