Share News

విజయవాడ ఉత్సవ్‌-2.0లో మెగా కార్నివాల్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 20 , 2026 | 08:42 PM

విజయవాడ ఉత్సవ్‌-2.0లో మెగా కార్నివాల్‌ సందడి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ సాంస్కృతిక కవాతులో పూలతో అలంకరించిన ఉత్సవ రథం, గుర్రాలు, ఒంటెలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విజయవాడ ఉత్సవ్‌-2.0లో మెగా కార్నివాల్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ra Chandrababu Naid

విజయవాడ, అక్టోబర్ 20: నగరంలో ఉత్సవ్‌-2.0లో భాగంగా నిర్వహించిన మెగా కార్నివాల్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శంఖాన్ని పూరించి సాంస్కృతిక కవాతుకు స్వాగతం పలికారు. విజయవాడ ఉత్సవ రథంతో కార్నివాల్‌ ప్రారంభం కాగా.. కాకరపర్రు, కడియం పూలతో రథాన్ని అందంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో అమ్మవారి చిత్రాన్ని తీర్చిదిద్ది ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు.

గుర్రాలు, ఒంటెలతో కళాకారులు చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డప్పు, సన్నాయి వాయిద్యాల బృందాలు, గరడి కళాకారుల ప్రదర్శనలతో కార్నివాల్‌ ఉత్సాహంగా సాగింది. సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవం, ఐక్యత, చరిత్రను చాటిచెప్పేలా సాంస్కృతిక కవాతును నిర్వహించారు.


కార్నివాల్‌లో పాల్గొన్న కళా బృందాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వివిధ కళారూపాలతో అలంకరించిన బేతాళం సెట్‌లను విజయవాడ వాసులు ఆసక్తిగా తిలకించారు. మెగా కార్నివాల్‌ సందర్భంగా ఏలూరు రోడ్‌ సందడిగా మారింది. కళాకారుల ప్రదర్శనలను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపించారు. తమ సెల్‌ఫోన్లలో వివిధ కళారూపాలను చిత్రీకరిస్తూ కేరింతలు కొట్టారు. సంప్రదాయ కళలు, సాంస్కృతిక ప్రదర్శనలతో విజయవాడ ఉత్సవ్‌-2.0లో మెగా కార్నివాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


ఈ వార్తలనూ చదవండి:

ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు.. బైకర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్

కశ్మీర్‌లో పురాతన శివలింగం పునరుద్ధరణ.. పోటెత్తుతున్న భక్తులు

Updated Date - Oct 20 , 2026 | 08:42 PM