బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు
ABN , Publish Date - Jan 27 , 2026 | 10:04 AM
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 విషయంలో బంగ్లాను పాక్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ బంగ్లాను రెచ్చగొడుతోందని.. ఇది పద్ధతి కాదని ఆయన వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లాదేశ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన పాకిస్తాన్.. బంగ్లా ఆడకపోతే తాము ఆడమని చెప్పుకొచ్చింది. సోమవారం పీసీబీ ఛైర్మన్ నఖ్వీ.. పాక్ పీఎంతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ ఆటడంపై శుక్రవారం వరకు నిర్ణయం తీసుకుంటామని పీఎం తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(Rajeev Shukla) పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరల్డ్ కప్(T20 World Cup 2026) విషయంలో బంగ్లాను పాక్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.
‘ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్(Bangladesh) ఆడాలని భారత్ కోరుకుంది. ఆ జట్టు ఆటగాళ్లకు పూర్తి భద్రత కల్పిస్తామని మేం హామీ కూడా ఇచ్చాం. అయినప్పటికీ.. కొలంబోలో మాత్రమే మ్యాచులు ఆడతామని బంగ్లా పట్టుబట్టింది. చివరి నిమిషంలో మొత్తం షెడ్యూల్‌ను మార్చడం చాలా కష్టమైన పని. అందుకే స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ఎంపిక చేశారు. పాకిస్తాన్ దురుద్దేశంతో బంగ్లాను ప్రోత్సహిస్తోంది.
పాకిస్తాన్ అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటూ బంగ్లాను తప్పుదోవ పట్టిస్తోంది. వారిని రెచ్చగొట్టడంలో పాక్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇలా చేయకూడదు. బంగ్లాదేశీయులపై పాకిస్తాన్ ఎలాంటి దారుణాలకు పాల్పడిందో ప్రపంచానికి తెలుసు. దేశం విడిపోయినప్పుడు తమకు ఎంత అన్యాయం జరిగిందో బంగ్లాదేశీయులకు తెలుసు. పాక్ ఇప్పుడు వారి శ్రేయోభిలాషిగా నటిస్తూ బంగ్లాను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోంది. ఇది తప్పు’ అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వివరించారు. భారత్‌లో మ్యాచ్‌లు ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఆ స్థానంలో స్కాట్లాండ్ ఆడుతుందని ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
మా వాళ్లతో జాగ్రత్త.. పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్
అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ