అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:50 PM
టీమిండియా ఓపెనర్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దీంతో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు. గువాహటి మ్యాచ్‌లో సంజూ గోల్డెన్ డకౌటైన అయిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్లైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
స్పోర్ట్స్ డెస్క్: గువాహటి వేదికగా న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనర్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దీంతో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో సంజూ గోల్డెన్ డకౌటైన(తొలి బంతికే ఔట్) అయిన సంగతి తెలిసిందే. ఇలా అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్లైన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు సంజూ. విరాట్, శాంసన్ భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో తలో ఏడుసార్లు గోల్డెన్ డకౌట్ అయ్యారు. విరాట్ ఈ చెత్త రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్‌లు తీసుకోగా.. శాంసన్ కేవలం 47 మ్యాచ్‌ల్లోనే ఈ చేదు ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గోల్డెన్ డకౌట్ల జాబితాలో భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. హిట్‌మ్యాన్ తన 151 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఏకంగా 12 సార్లు గోల్డెన్ డకౌటయ్యాడు.
టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్స్
రోహిత్ శర్మ - 12 (151 మ్యాచ్‌లు)
సంజు శాంసన్-7 (47 మ్యాచ్‌లు*)
విరాట్ కోహ్లీ - 7 (117 మ్యాచ్‌లు)
సూర్యకుమార్ యాదవ్ - 6 (96 మ్యాచ్‌లు*)
కేఎల్ రాహుల్ - (68 మ్యాచ్‌లు*)
మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలనే ఛేదించిన భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. న్యూజిలాండ్‌ను 153 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఓ మోస్తారు లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి టీమండియా గెలుపును ఆదిలోనే ఖరారు చేశారు. జోరు పెంచే క్రమంలో ఇషాన్ ఔటైనా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్.. అభిషేక్‌తో కలిసి విధ్వంసాన్ని కొనసాగించాడు.
భారత్ జట్టు 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కైవసం చేసుకుంది. మరోవైపు శాంసన్ ఫామ్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. కివీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ అతను దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 10, 6 పరుగులతో ఊసురుమనిపించాడు. ఈ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా సిరీస్‌లో శాంసన్ మంచి ప్రదర్శనే చేశాడు. దీంతో అతనికి ప్రపంచకప్ బెర్త్ దక్కింది. అయితే ఇటీవల వరుస వైఫల్యాల నేపథ్యంలో శాంసన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అతనికి పోటీగా ఇషాన్, శుభ్‌మన్ గిల్ పేర్లను సెలెక్టర్లు పరిశీలించవచ్చని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
నా రికార్డును బ్రేక్ చేయలేకపోయావ్.. అభిషేక్ శర్మను ఆటపట్టించిన యువీ
టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రపంచ కప్ నాటికి స్టార్ ప్లేయర్‌కు పూర్తి ఫిట్‌నెస్!