పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది వక్ర బుద్ధి.. మరోసారి భారత్‌పై అక్కసు
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:23 PM
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సైతం తన వక్రబుద్ధిని చూపించాడు. భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. టీ20 ప్రపంచ కప్-2026 నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ అంశంలో భారత్‌ను లాగి తన కుటిల బుద్ధిని చాటుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: తాను బాగుపడటం చేతకాదు.. కానీ పక్కవారిని చెడగొట్టేందుకు, వారిపై ఆరోపణలు చేసేందుకు రెడీగా ఉంటారు కొందరు. అచ్చం అలాగే ప్రవర్తిస్తుంటాయి కొన్ని దేశాలు. అలాంటి వాటిల్లో పాకిస్థాన్ ఒకటి. అక్కడి పాలకులకు నిద్రలేచింది మొదలు పడుకునే వరకు భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది. ఆ దేశ క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు సైతం టీమిండియాపై తమ అసూయను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా.. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది(Shahid Afridi) సైతం తన వక్రబుద్ధిని చూపించాడు. భారత్‌పై మరోసారి తన అక్కసు బయటపెట్టాడు.
టీ20 ప్రపంచ కప్(ICC Mens T20 World Cup) 2026 నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ అంశంలో భారత్‌ను లాగి తన వక్రబుద్ధిని చాటుకున్నాడు అఫ్రిది. భద్రతను సాకుగా చూపుతూ ఇండియాలో మ్యాచ్‌లు ఆడమని ఓవరాక్షన్ చేసిన బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు ఐసీసీ(ICC) అవకాశమివ్వడాన్ని అతడు తప్పుబట్టాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) సందర్భంగా భారత్, పాకిస్థాన్‌లో పర్యటించని అంశాన్ని ఈ సందర్భంగా అతడు గుర్తు చేశాడు. ‘ఓ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఐసీసీ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. గతంలో భద్రత కారణాల వల్ల పాకిస్థాన్‌లో పర్యటించడానికి భారత్ ఒప్పుకోలేదు. దీన్ని ఐసీసీ సమర్థించింది. కానీ..ఇప్పుడు అదే అంశంపై బంగ్లా విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించింది’ అని అఫ్రిది సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ నేపథ్యంలో షాషిద్ అఫ్రిదిపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్‌ను అనవసరంగా వివాదంలోకి లాగుతున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థాన్ లాంటి దేశం, అఫ్రిది లాంటి వారి చెప్పుడు మాటలు వినడం కారణంగానే బంగ్లాదేశ్‌కు ఈ గతి పట్టిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాకు జరిగిన ఆర్థిక నష్టాన్ని పాక్ తీరుస్తుందా అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపించారు. అయినా.. చెడు సావాసం చేసిన బంగ్లాదేశ్‌కు ఇలాంటి గతి పట్టాలంటూ పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ప్రపంచ కప్ 2026 ఆడే విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో(BCB) ఐసీసీ(ICC) పలుమార్లు చర్చలు జరిపింది. వీడియో కాన్ఫరెన్స్‌లతో పాటు నేరుగా ఢాకాలోనూ బీసీబీ అధికారులతో ఐసీసీ సమావేశమై సమస్య పరిష్కారం కోసం కృషి చేసింది. అయినా బంగ్లా మొండిపట్టు వీడకపోవడంతో.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌కు ఐసీసీ అనుమతిచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది.
ఇవి కూడా చదవండి:
నా రికార్డును బ్రేక్ చేయలేకపోయావ్.. అభిషేక్ శర్మను ఆటపట్టించిన యువీ
టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రపంచ కప్ నాటికి స్టార్ ప్లేయర్‌కు పూర్తి ఫిట్‌నెస్!