నా రికార్డును బ్రేక్ చేయలేకపోయావ్.. అభిషేక్ శర్మను ఆటపట్టించిన యువీ
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:36 PM
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి బ్యాటింగ్‌కు ఫిదా అయిన టీమిండియా క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్.. అభిని ఎక్స్ వేదికగా ప్రశంసించాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో ఏకంగా 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా అర్ధ శతకం బాదిన రెండో బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. అతడి బ్యాటింగ్‌కు ఫిదా అయిన టీమిండియా క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్(Yuvraj Singh).. అభిని ఎక్స్ వేదికగా ప్రశంసించాడు.
సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ట్రైనింగ్‌లో అభిషేక్ శర్మ(Abhishek Sharma) రాటుదేలిన విషయం తెలిసిందే. అభిషేక్ 14 బంతుల్లో అర్ధసెంచరీ చేయడంపై ఆయన ఫన్నీగా స్పందించారు. ‘ఇప్పటికీ 12 బంతుల్లో ఫిఫ్టీ చేయలేకపోయావ్.. సరే లే వెల్ ప్లేయిడ్. ఇలానే కొనసాగించు’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన రికార్డు యువరాజ్ సింగ్ పేరిటే ఉంది. ఇంగ్లండ్‌పై కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచులోనే యువీ 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. తాజా మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను హార్దిక్ పాండ్యా రికార్డ్‌ను అధిగమించాడు. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.
అంత ఈజీ కాదు: అభిషేక్
‘జట్టు నా నుంచి ఆశిస్తున్నది విధ్వంసకర బ్యాటింగే. కానీ అది అన్ని సార్లు సాధ్యపడదు. యువీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. కానీ భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు. బ్యాటర్లందరూ బాగా ఆడుతున్నారు. ఈ సిరీస్ ముందు ముందు ఇంకా సరదాగా సాగబోతోంది. లెగ్‌సైడ్ వైపు ఆడటం అనేది ఫీల్డ్ ప్లేస్‌మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నాకు గ్యాప్ దొరికితే ఆఫ్ సైడ్ కూడా షాట్లు కొట్టగలను. నేను కేవలం ఫీల్డింగ్‌కు తగ్గట్లుగా ఆడాలనుకుంటాను’ అని అభిషేక్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
టీమిండియాను చూసి ప్రత్యర్థి జట్లు భయపడాల్సిందే: సునీల్ గావస్కర్
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా కన్నుమూత