Share News

టీమిండియాను చూసి ప్రత్యర్థి జట్లు భయపడాల్సిందే: సునీల్ గావస్కర్

ABN , Publish Date - Jan 26 , 2026 | 10:33 AM

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాట్లాడాడు. అద్భుతంగా ఆడారంటూ కొనియాడాడు.

టీమిండియాను చూసి ప్రత్యర్థి జట్లు భయపడాల్సిందే: సునీల్ గావస్కర్
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: గువాహటి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. తొలుత కివీస్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కివీస్ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. 154 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకు దిగిన టీమిండియా.. 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఆటను ముగించింది. అభిషేక్ శర్మ(68*; 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులు), సూర్యకుమార్ యాదవ్(57*; 26 బంతుల్లో 6 ఫ్లోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా.. 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.


భారత బ్యాటర్ల విధ్వంసంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) స్పందించాడు. అద్భుతంగా ఆడారంటూ కొనియాడాడు. ‘కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు. బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచింగ్ బాగుంది. టీమిండియా ఆటతీరు అమోఘం. ఏదైనా జట్టు ఈ మ్యాచ్‌ను చూస్తుంటే.. భారత్‌ను ఎలా ఎదుర్కోవాలా? అని ఆలోచిస్తుంది. భారత్ విజయాన్ని చూసి ప్రత్యర్థి జట్లు భయపడాల్సిందే. అంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించడం చాలా కష్టం. కానీ చాలా మ్యాచుల్లో అభిషేక్ శర్మ చేసి చూపిస్తున్నాడు. ఒకసారి 14 బంతుల్లో అర్ధశతకం చేస్తే.. మరోసారి 16 బంతుల్లో సాధించాడు. అతడు ఏదో ఒకరోజు కచ్చితంగా యువరాజ్‌ సింగ్‌ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డ్‌‌ను బ్రేక్‌ చేస్తాడు. అప్పుడు అందరికంటే ఎక్కువ యువీనే ఆనందిస్తాడు’ అని సునీల్‌ గావస్కర్‌ అన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్

సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్

Updated Date - Jan 26 , 2026 | 10:33 AM