సూర్య ఫైర్ అభిషేక్ వైల్డ్‌ఫైర్
ABN , Publish Date - Jan 26 , 2026 | 06:06 AM
టీ20 వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు టీమిండియా ఆడుతున్న తీరు ప్రత్యర్థి జట్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నదనడంలో సందేహం లేదు. శుక్రవారం 209 పరుగుల ఛేదనను భారత్ 15.2 ఓవర్లలో....
డబ్ల్యూపీఎల్‌లో నేడు
ముంబై X బెంగళూరు (రా. 7.30)
అభిషేక్ శర్మ (20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 నాటౌట్)
మూడో టీ20లో కివీస్‌పై భారత్ ఘనవిజయం
గువాహటి: టీ20 వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు టీమిండియా ఆడుతున్న తీరు ప్రత్యర్థి జట్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నదనడంలో సందేహం లేదు. శుక్రవారం 209 పరుగుల ఛేదనను భారత్ 15.2 ఓవర్లలో ముగించి వహ్వా అనిపించింది. ఇక ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 154 పరుగుల లక్ష్యాన్ని అంత సులువుగా వదులుతారా?.. అభిషేక్ శర్మ (20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 నాటౌట్), సూర్యకుమార్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్‌తో కేవలం పది ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించ డం విశేషం. ఇరు జట్లు కనీసం డ్రింక్ విరామం కూడా తీసుకోలేదంటే వీరి విధ్వంసహోరు అర్థమవుతుంది. 8 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్ మరో రెండు మ్యాచ్‌లుండగానే 3-0తో సిరీ్‌సను దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఫిలిప్స్ (48), చాప్‌మన్ (32), శాంట్నర్ (27) మాత్రమే రాణించారు. బుమ్రాకు మూడు, బిష్ణోయ్, హార్దిక్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్ 10 ఓవర్లలో 2 వికెట్లకు 155 పరుగులు చేసి నెగ్గింది. ఇషాన్ (13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28) రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా జస్‌ప్రీత్ బుమ్రా నిలిచాడు.
ఏమా బాదుడు?: ఓ మాదిరి ఛేదనలో కివీస్ బౌలర్లకు ఓపెన్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ చుక్కలు చూపించారు. ఉన్నకాసేపు ఇషాన్ సైతం బ్యాట్ ఝుళిపించడంతో స్కోరుబోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ శాంసన్‌ను పేసర్ హెన్రీ గోల్డెన్ డకౌట్ చేసినా.. ఇషాన్ వచ్చీ రావడంతోనే 6,6,4తో తొలి ఓవర్‌లోనే 16 రన్స్ అందించాడు. అటు అభిషేక్ తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి మరింత ఊపు తెచ్చాడు. నాలుగో ఓవర్‌లో ఇషాన్ వెనుదిరిగాక సూర్య ప్రతాపం ఆరంభమైంది. ఆరో ఓవర్‌లో అభిషేక్ 4,4,6తో 14 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేయగా.. అదే ఓవర్‌లో సూర్య సిక్సర్‌తో జట్టు పవర్‌ప్లేలో 94/2 స్కోరుతో అదరగొట్టింది. పదో ఓవర్‌లో సూర్య 6,4,4తో 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేయడమే కాకుండా మ్యాచ్‌ను కూడా ముగించాడు.
తడబాటుతో ఆరంభం: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ భారత బౌలర్ల ధాటికి పరుగుల కోసం చెమటోడ్చింది. మధ్య ఓవర్లలో కాస్త ఫర్వాలేదనిపించినా, ఆరంభంతో పాటు డెత్‌ఓవర్లలో చతికిలపడింది. బిష్ణోయ్, బుమ్రా కట్టడి చేశారు. దీంతో అతికష్టంగా 150 రన్స్ దాటగలిగింది. ఫిలిప్స్, చాప్‌మన్ మాత్రమే దీటుగా ఎదుర్కొన్నారు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ కాన్వే (1)ను పేసర్ హర్షిత్, రెండో ఓవర్‌లో రచిన్ (4)ను హార్దిక్ దెబ్బతీశాడు. కాసేపటికే ఓపెనర్ సీఫర్ట్ (12)ను బుమ్రా బౌల్డ్ చేయడంతో పవర్‌ప్లేలో కివీస్ 36/3 స్కోరుతో దయనీయంగా కనిపించింది. ఈ దశలో ఫిలి్‌ప్సకు చాప్‌మన్ జత కలిశాడు. అయితే ఈ జోడీ జాగ్రత్తగా ఆడడంతో 5-8 ఓవర్ల మధ్య కనీసం ఫోర్ కూడా నమోదు కాలేదు. కానీ కుల్దీప్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో చాప్‌మన్ 6,4 ఫిలిప్స్ 6తో 19 రన్స్ సమకూరాయి. చక్కగా కుదురుకున్న ఈ జోడీని బిష్ణోయ్ విడదీశాడు. 12వ ఓవర్‌లో తను చాప్‌మన్‌ను అవుట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే మిచెల్ (14), ఫిలిప్స్ వరుస ఓవర్లలో వెనుదిరగ్గా కివీస్ కష్టాలు ఆరంభమయ్యాయి. శాంట్నర్ బ్యాట్ ఝుళిపించినా సహకారం కరువైంది. చివరి ఐదు ఓవర్లలో జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్: కాన్వే (సి) హార్దిక్ (బి) హర్షిత్ 1, సీఫర్ట్ (బి) బుమ్రా 12, రచిన్ (సి) బిష్ణోయ్ (బి) హార్దిక్ 4, ఫిలిప్స్ (సి) ఇషాన్ (బి) బిష్ణోయ్ 48, చాప్‌మన్ (సి) శాంసన్ (బి) బిష్ణోయ్ 32, మిచెల్ (సి) ఇషాన్ (బి) హార్దిక్ 14, శాంట్నర్ (సి) అభిషేక్ (బి) బుమ్రా 27, జేమిసన్ (బి) బుమ్రా 3, హెన్రీ (రనౌట్) 1, సోధీ (నాటౌట్) 2, డఫీ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 153/9. వికెట్ల పతనం: 1-2, 2-13, 3-34, 4-86, 5-112, 6-112, 7-132, 8-134, 9-144. బౌలింగ్: హర్షిత్ 4-0-35-1, హార్దిక్ 3-0-23-2, బిష్ణోయ్ 4-0-18-2, బుమ్రా 4-0-17-3, కుల్దీప్ 3-0-32-0, దూబే 2-0-24-0.
భారత్: అభిషేక్ (నాటౌట్) 68, శాంసన్ (బి) హెన్రీ 0, ఇషాన్ (సి) చాప్‌మన్ (బి) సోధీ 28, సూర్య (నాటౌట్) 57; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 10 ఓవర్లలో 155/2. వికెట్ల పతనం: 1-0, 2-53. బౌలింగ్: హెన్రీ 2-0-28-1, డఫీ 2-0-38-0, జేమిసన్ 1-0-17-0, సోధీ 2-0-28-1, శాంట్నర్ 2-0-28-0, ఫిలిప్స్ 1-0-16-0.
3-0తో సిరీస్ కైవసం
1
టీ20ల్లో 25 అంతకంటే తక్కువ బంతుల్లోనే ఎక్కువ (9) 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా అభిషేక్
1
ఈ ఫార్మాట్‌లో 3.1 ఓవర్లలోనే 50 పరుగులు చేయడం భారత్‌కిది తొలిసారి.
2
భారత్ తరఫున పొట్టి ఫార్మాట్‌లో వేగంగా (14 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా అభిషేక్. యువరాజ్ (12) ముందున్నాడు.
2
టీ20 పవర్‌ప్లేలో తమ రెండో అత్యధిక స్కోరు (94/2)ను సాధించిన భారత్. గతేడాది ఇంగ్లండ్‌పై 95/1 స్కోరుతో టాప్‌లో ఉంది.
2
టీ20ల్లో తొలి బంతికే అవుటైన నాలుగో భారత బ్యాటర్‌గా శాంసన్. గతంలో రాహుల్, పృథ్వీ షా, రోహిత్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
త్వరలోనే మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగం
ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్
Read Latest National News