ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:43 PM
మహాబలిపురంలో ఆదివారంనాడు జరిగిన పార్టీ స్ట్రాటజీ మీటింగ్‌లో విజయ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సుమారు 3,000 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మహాబలిపురం: తమిళనాడులో మరి కొద్ది నెలల్లో జరిగేది ఎన్నికల పోరు కాదని, ప్రజాస్వామ్య యుద్ధమని తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ (Vijay) అన్నారు. టీవీకే ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గదని, ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఇటీవల సీబీఐ విచారణను ఆయన ఎదుర్కోవడం, తన కొత్త సినిమా విడుదలకు నోచుకోకుండా నిలిచిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో విజయ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మహాబలిపురంలో ఆదివారంనాడు జరిగిన పార్టీ స్ట్రాటజీ మీటింగ్‌లో విజయ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సుమారు 3,000 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే తొలిసారి పోటీ చేస్తోంది. దీనిపై తన మద్దతుదారులను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ.. 'ఇవి కేవలం ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం. మీరంతా ఈ యుద్ధంలో పోరాటం సాగించే నా కమండోలు' అని అన్నారు. అధికార డీఎంకే, ప్రధాన విపక్షం ఏఐడీఎంకేను టార్గెట్ చేస్తూ.. ఎవరైతే 'అన్న' పేరును రాజకీయాల్లో వాడుకుంటున్నారో వారు అన్నాదురైను మరిచిపోయారని విమర్శించారు. అధికారంలో ఉన్న వారికి పోలింగ్ బూత్‌లు బోగస్ ఓట్ సెంటర్లుగా మారాయన్నారు. 'ప్రతి ఓటును పరిరక్షించుకోవాలి, ప్రతి ఒక్క ఓటరును కలవండి. దుష్ట శక్తి (డీఎంకే)ని, అవినీతి కూటమి (అన్నాడీఎంకే)ని ఎదుర్కొనే దమ్ము టీవీకేకు మాత్రమే ఉంది' అని అన్నారు.
రేపట్నించి రాష్ట్రవ్యాప్త ప్రచార యాత్ర
కాగా, సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచార యాత్రను టీవీకే చేపట్టనున్నట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. ఈసారి ఎన్నికల్లో పార్టీ పొత్తులపై టీవీకే ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై విజయ్ ఒక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం టీవీకేకు 'విజల్' గుర్తును ఇటీవల కేటాయించింది.
ఇవి కూడా చదవండి..
వయసు 18 ఏళ్లు నిండాక ఓటరుగా రిజిస్టర్ అవ్వండి.. యువతకు ప్రధాని మోదీ పిలుపు
గణతంత్ర దినోత్సవం..982 మంది పోలీసులకు అవార్డులు
Read Latest National News