వయసు 18 ఏళ్లు నిండాక ఓటరుగా రిజిస్టర్ అవ్వండి.. యువతకు ప్రధాని మోదీ పిలుపు
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:49 PM
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని యువతకు ప్రత్యేక పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరుగా రిజిస్టర్ అవ్వండని కోరారు. ఇది.. రాజ్యాంగపరమైన హక్కు మాత్రమే కాదు, భారత భవిష్యత్తును రూపొందించడంలో గొప్ప బాధ్యత కూడా అని మోదీ అన్నారు.
న్యూ ఢిల్లీ, జనవరి 25: భారతదేశ వ్యాప్తంగా ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవం (National Voters' Day) ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యువతకు ప్రత్యేక పిలుపునిచ్చారు. మీ వయస్సు 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరుగా రిజిస్టర్ అవ్వండని కోరారు. ఈ రోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ జనవరి 26కు ముందు రోజు కావడంతో, ఇది.. రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించే అవకాశంగా తాను భావిస్తున్నానని ప్రధాని అన్నారు.
ఇవాళ ప్రధాని మోదీ ఈ ఏడాది మొదటి 'మన్ కీ బాత్' (130వ ఎపిసోడ్)లో యువ ఓటర్ల నమోదు విషయంపై మాట్లాడారు. ఓటరు డెమాక్రసీ దేశానికి ఆత్మ అని, యువత ఓటరుగా మారినప్పుడు ఆ ఊరు, గ్రామం లేదా నగరం మొత్తం ఒక్కటై స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు చెప్పాలని సూచించారు. ఇది ఓటు గురించి అవగాహన పెంచుతుందని ప్రధాని మోదీ చెప్పారు.
18 ఏళ్లు పూర్తయ్యాక ఓటరుగా రిజిస్టర్ అవ్వమని నా యువ స్నేహితులకు మళ్లీ పిలుపునిస్తున్నానని మోదీ అన్నారు. ఓటరుగా ఉండటం కేవలం రాజ్యాంగపరమైన హక్కు మాత్రమే కాదు, భారత భవిష్యత్తును రూపొందించడంలో ప్రతి పౌరుడికి గొప్ప బాధ్యత కూడా అని మోదీ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో గ్రాస్‌రూట్ స్థాయిలో పనిచేసే వారందరినీ అభినందిస్తున్నానని, వారి కృషి వల్లే మన భారత ప్రజాస్వామ్యం బతికి ఉందని మోదీ చెప్పారు.
అంతేకాదు, ఎక్స్ (ట్విట్టర్)లో కూడా ప్రధాని మోదీ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మన దేశ ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే రోజు ఇది. ఎన్నికల సంఘం సిబ్బందికి అభినందనలు. ఓటరుగా ఉండటం రాజ్యాంగ హక్కు మాత్రమే కాదు, భారత భవిష్యత్తును రూపొందించే ముఖ్య బాధ్యత. ప్రజాస్వామ్య ప్రక్రియల్లో ఎల్లప్పుడూ పాల్గొని వికసిత భారత్ బలోపేతం చేద్దాం.' అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
హెచ్-1బీ వీసాదారులకు మరో షాక్! ఇక ఇంటర్వ్యూలు వచ్చే ఏడాదే..
పావు గంటే టైమిచ్చారు.. లేకపోతే చంపేస్తామన్నారు: వెనెజువెలా అధ్యక్షురాలు