హెచ్-1బీ వీసాదారులకు మరో షాక్! ఇక ఇంటర్వ్యూలు వచ్చే ఏడాదే..
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:21 AM
హెచ్-1బీ వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు వార్తలు వెలువడటంతో లబ్ధిదారులు అనేక మంది అయోమయ స్థితిలో పడిపోయారు. దరఖాస్తుల పరిశీలన బ్యాక్‌లాగ్స్ భారీగా పేరుకుపోవడంతో సాధారణ స్లాట్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల కోసం వేచి చూస్తున్న హెచ్-1బీ వీసాదారుల నెత్తిన మరో పిడుగు పడింది. ఈ ఏడాదికి సంబంధించి ఇంటర్వ్యూ స్లాట్స్ వచ్చే ఏడాదికి వాయిదాపడ్డట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీసా బ్యాక్‌లాగ్స్ పెరిగిన నేపథ్యంలో ఇంటర్వ్యూ స్లాట్స్ వచ్చే ఏడాదికి మారినట్టు సమాచారం. ఇప్పటికే వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన అనేక మంది హెచ్-1బీ వీసాదారులకు ఈ వార్తలు అశనిపాతంగా మారాయి. అనేక మంది తాము ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూరుకుపోయారు (H-1B visa Stamping Interviews Postponed to 2027)).
గతేడాది డిసెంబర్‌లో జరగాల్సిన వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు మొదట ఈ ఏడాది మార్చ్‌కు వాయిదాపడ్డాయి. అనంతరం.. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయన్న వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇంటర్వ్యూలు ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయన్న వార్త మరింత కలకలం రేపుతోంది.
ఈ పరిణామాలపై అమెరికాలో వలసల వ్యవహారాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 50 రోజుల్లో భారత్‌లో ఒక్క వీసా స్లాట్ కూడా అందుబాటులోకి వచ్చినట్టు తమ దృష్టికి రాలేదని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉంటున్న వారు భారత్‌కు తిరిగెళ్లొద్దని సూచించారు. ‘వీసా జారీని వారు తాత్సారం చేస్తున్నారు. కుదిరితే ఏకంగా వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇది బైడెన్ జమానా కాదు. ఇది మరో ప్రపంచం. వీసాలు ఇవ్వాలన్న ఉద్దేశం అమెరికా ప్రభుత్వానికి లేనేలేదు’ అని ఒక ఇమిగ్రేషన్ లాయర్ హెచ్చరించారు.
2027 వరకూ రెగ్యులర్ ఎపాయింట్‌మెంట్సే లేవని మరో ఇమిగ్రేషన్ లాయర్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో ఇంటర్వ్యూ స్లాట్స్ పొందిన వారికి వచ్చే ఏడాదిలో కొత్త స్లాట్స్‌ను కేటాయించారని చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలోని అమెరికన్ కాన్సులేట్స్‌లో రెగ్యులర్ ఇంటర్వ్యూ స్లాట్స్ లేకపోవడంతో అధికారులు అపాయింట్‌మెంట్స్‌ను వచ్చే ఏడాదికి మర్చారని చెప్పారు. వీసా లబ్ధిదారుల సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలనను అమెరికా ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో దరఖాస్తులు పేరుకుపోయి బ్యాక్‌లాగ్స్‌కు దారి తీసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా స్క్రీనింగ్‌కు ఎక్కువ సమయం పడుతుండటంతో రోజువారి ఇంటర్వ్యూల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
ఇవీ చదవండి:
పావు గంటే టైమిచ్చారు.. లేకపోతే చంపేస్తామన్నారు: వెనెజువెలా అధ్యక్షురాలు
అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల కాల్పుల్లో పౌరుడి మృతి.. షాకింగ్ వీడియో