అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల కాల్పుల్లో పౌరుడి మృతి.. షాకింగ్ వీడియో
ABN , Publish Date - Jan 25 , 2026 | 09:23 AM
అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మిన్నెసోటాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతడి వద్ద ఉన్న తుపాకీని తీసుకునే క్రమంలో కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మృతుడి కుటుంబం మాత్రం ఈ వాదనను తిరస్కరిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అక్రమ వలసదారుల ఏరివేత పేరిట అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా మిన్నెసోటాలో ఓ వ్యక్తి పోలీసు కాల్పుల్లో మరణించడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో జనవరి 24న ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా పౌరుడు ఎలెక్స్ జెఫ్రీ ప్రిట్టీ పోలీసు కాల్పుల్లో మరణించాడు (Alex Jeffrey Pretti shot Dead by Immigration Officials).
ప్రిట్టీ వద్ద నుంచి తుపాకీ తీసుకునే క్రమంలో స్వీయ రక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ చెబుతోంది. అయితే, బాధితుడి కుటుంబసభ్యులు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. ఘటన సమయంలో ప్రిట్టీ వద్ద ఎలాంటి ఆయుధం లేదని, నిరసనల్లో పాల్గొంటున్న ఓ మహిళను ప్రిట్టీ కాపాడే ప్రయత్నంలో ఉండగా పోలీసులు కాల్పులు జరిపారని వాదిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి అనేక వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇమిగ్రేషన్ అధికారులు ప్రిట్టీని నేలపై అదిమిపెట్టగా అక్కడే ఉన్న ఓ మహిళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం ఓ వీడియోలో కనిపించింది. పరిస్థితి చేయిజారుతున్నదని గమనించిన మహిళ కంగారు పడిపోతూ అధికారులు హెచ్చరించింది. ‘మీరేం చేస్తున్నారో అర్థమవుతోందా..’ అని తను అరుస్తుండగానే కాల్పుల శబ్దం వినిపించినట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఎవరైనా వెంటనే అంబులెన్స్‌ను పిలవండి.. దేవుడా ఎంత పని జరిగింది’ అని ఆమె అనడం కూడా వీడియోలో రికార్డయ్యింది. ప్రిట్టీ చేతిలో ఒక ఫోన్ మాత్రమే ఉన్నట్టు మరో వీడియోలో కనిపించింది. నిరసనతెలుపుతున్న ఓ మహిళను పోలీసులు నేలపై అదిపెట్టి కదలకుండా చేసినప్పుడు ఆమెకు సాయంగా ప్రిట్టీ వెళ్లాడు. ఈ క్రమంలో అధికారులు కాల్పులు జరపడంతో అతడు కన్నుమూశాడు.
ఈ ఘటనపై మిన్నెసోటా రాష్ట్ర గవర్నర్ టిమ్ వాల్జ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసల కట్టడి చర్యలను వెంటనే నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. ‘సరైన శిక్షణ లేని వేల మంది కేంద్ర అధికారులు రాష్ట్రానికి వచ్చారు. వారందరినీ అమెరికా ఫెడరల్ ప్రభుత్వం వెంటనే వెనక్కు పిలిపించాలి’ అని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
మిన్నియాపొలిస్‌లో మరో పౌరుడి కాల్చివేత