మంచు తుఫానుతో అమెరికా గజగజ
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:54 AM
భీకర మంచు తుఫానుతో అమెరికా తూర్పు తీరం గడ్డకట్టుకుపోయింది. తుఫాను మరింత తీవ్రంగా మారొచ్చన్న అమెరికా జాతీయ వాతావరణ సేవల విభాగం...
9 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
వాషింగ్టన్, జవనరి 24: భీకర మంచు తుఫానుతో అమెరికా తూర్పు తీరం గడ్డకట్టుకుపోయింది. తుఫాను మరింత తీవ్రంగా మారొచ్చన్న అమెరికా జాతీయ వాతావరణ సేవల విభాగం(ఎన్‌డబ్ల్యూఎ్‌స) అంచనాలతో దాదాపు 15 రాష్ట్రాల గవర్నర్లు వాతావరణ ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. మంచు తుఫాను ప్రభావం విమాన సర్వీసులపై భారీగా పడింది. అమెరికాలో శని, ఆదివారాలకు సంబంధించి 9వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని భావిస్తున్నారు. ఈ నెల 25, 26వ తేదీల్లో ఢిల్లీ, ముంబైల నుంచి న్యూయార్క్‌కు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. దట్టమైన మంచుతో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. తఫాను ప్రభావం 14కోట్ల మందిపై పడింది. ఒక్లహామా, నార్త్ డకోటా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు -40డిగ్రీలకు పడిపోయాయి. మంచు తుఫాను వేళ ప్రజలకు సాయం అందించడం కోసం ఫెడరల్ గవర్నమెంట్ కూడా అనేక ఏర్పాట్లు చేసింది.