పావు గంటే టైమిచ్చారు.. లేకపోతే చంపేస్తామన్నారు: వెనెజువెలా అధ్యక్షురాలు
ABN , Publish Date - Jan 25 , 2026 | 10:23 AM
మదురో అరెస్టు తరువాత తమకు అమెరికా దళాలు కేవలం 15 నిమిషాలే టైమిచ్చి తదుపరి చర్యపై నిర్ణయం తీసుకోమని బెదిరించాయని వెనెజువెలా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రీగెజ్ చెప్పినట్టు ఉన్న ఆడియో రికార్డింగ్ ఆ దేశంలో కలకలం రేపుతోంది. అమెరికాకు, డెల్సీకి మధ్య రహస్య ఒప్పందం ఉందన్న వార్తల నడుమ ఈ పరిణామానికి అమిత ప్రాధాన్యం ఏర్పడింది.
ఇంటర్నెట్ డెస్క్: మదురో అరెస్టుకు ముందు నుంచే వెనెజువెలా నేత, ప్రస్తుత ఆపద్ధర్మ అధ్యక్షురాలు డెల్సీ రోడ్రీగెజ్ అమెరికా అధికారులతో టచ్‌లో ఉన్నారన్న వార్త ఆ దేశంలో కలకలం రేపుతోంది. అయితే, మదురో అరెస్టు తరువాత కేబినెట్ సభ్యులను చంపేస్తామని అమెరికా దళాలు హెచ్చరించారని డెల్సీ రోడ్రీగెజ్ చెబుతున్నట్టున్న ఓ ఆడియో లీక్ ప్రస్తుతం వెనెజువెలాలో మరింత కలకలం రేపుతోంది (Delcy Rodriguez audio leak).
మదురో మద్దతుదారులతో ఇటీవలి సమావేశంలో డెల్సీ పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు ఉన్న ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మదురో కిడ్నాప్ అయిన మరుక్షణం నుంచే తమపై అమెరికా దళాలు బెదిరింపులకు దిగాయని డెల్సీ ఆ సమావేశంలో పేర్కొన్నారట. ‘డయోస్డాడో కబెల్లోకు (వెనెజువెలా అంతర్గత వ్యవహారాల మంత్రి), జార్జ్ రోడ్రీగెజ్‌కు (డెల్సీ సోదరుడు), అమెరికా దళాలు కేవలం 15 నిమిషాలు టైమిచ్చాయి. అమెరికాకు మద్దతివ్వాలని ఒత్తిడి చేశాయి. లేకపోతే చంపేస్తామని అమెరికా సైనికులు అన్నారు’ అని డెల్సీ అన్నారట. అంతేకాకుండా, మదురో, ఆయన భార్యను చంపేశామని కూడా అమెరికా దళాలు చెప్పాయని ఆమె పేర్కొన్నారు. తమకు కూడా అదే గతి పడుతుందని బెదిరించారని అన్నారు.
ప్రస్తుత కఠిన పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు వ్యూహాత్మక సహనం కనబరచాలని కూడా ఆ సమావేశంలో మదురో మద్దతుదారులను కోరారు. డెల్సీ వాదనను వెనెజువెలా కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి సమర్థించారు. డెల్సీపై వస్తున్న వదంతులకు స్వస్తి పలకాలని కూడా సూచించారు. మదురోను వెనక్కు తెచ్చుకునేందుకు తమకున్న ఒకే ఒక ఆశాకిరణం డెల్సీ అని కూడా కామెంట్ చేశారు. మదురో అరెస్టుకు ముందే డెల్సీ అమెరికాతో అధికార మార్పిడిపై రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తల నడుమ ఈ పరిణామానికి అమిత ప్రాధాన్యం ఏర్పడింది.
ఇవీ చదవండి:
అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల కాల్పుల్లో పౌరుడి మృతి.. షాకింగ్ వీడియో