సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:38 PM
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతుంది. టాపార్డర్‌లో అందరూ రాణిస్తున్నప్పటికీ.. కొంత ఆందోళన కలిగిస్తోంది మాత్రం వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ మాత్రమే. ఈ విషయంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతుంది. ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. నేడు గువాహటి వేదికగా జరిగే మ్యాచులో గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. టాపార్డర్‌లో అందరూ రాణిస్తున్నప్పటికీ.. కొంత ఆందోళన కలిగిస్తోంది మాత్రం వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ మాత్రమే. టీ20ల్లో శుభ్‌మన్ గిల్‌పై వేటు పడటంతో అభిషేక్‌కు ఓపెనింగ్ భాగస్వామిగా అతడే ఖరారయ్యాడు. తొలి రెండు టీ20ల్లో సంజూ(Sanju Samson) తీవ్రంగా నిరాశపర్చాడు. మరోవైపు రెండో మ్యాచులో వన్ డౌన్ బ్యాటర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొడుతున్నాడు. అయితే ఇషాన్ ఇన్నింగ్స్‌తో సంజూ శాంసన్‌పై మరింత ఒత్తిడి పెరుగుతుందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్(Srikkanth) అభిప్రాయపడ్డాడు.
‘తిలక్ వర్మ జట్టులోకి వస్తే ఎవరిని పక్కన పెడతారు? సంజూ శాంసన్‌ను బయటికి పంపిస్తారా? ఇప్పటికే సంజూ చాలా ఒత్తిడిలో ఉన్నాడు. రెండో టీ20లో ఇన్నింగ్స్ రెండో బంతికే అతడు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ రెండు బంతుల అనంతరం మళ్లీ ఓ చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో అతడు జాగ్రత్తగా ఆడి సింగిల్స్ తీసి ఉండాల్సింది. అభిషేక్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా బౌలింగ్‌పై దాడి చేయడమే అతడు చేసిన తప్పు. ఇలాంటి సమయాల్లో స్ట్రైక్ రొటేట్ చేసి లయను తిరిగి పొందాలి. కానీ సంజూ తొందర పడ్డాడు. మరోవైపు ఇషాన్ కిషన్(Ishan Kishan) అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు వికెట్ కీపర్ అని కూడా సంజూకు తెలుసు. దీంతో అతడిపై ఒత్తిడి పెరుగుతుంది. జట్టులో పోటీ చాలా తీవ్రంగా ఉంది. సూర్య కుమార్ యాదవ్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు’ అని క్రిష్ విశ్లేషించాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ
ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్