అవును.. బంగ్లా అవుట్
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:35 AM
భారత్ నుంచి తమ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు శ్రీలంకకు తరలించాలన్న మంకుపట్టు వీడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గట్టి షాకిచ్చింది. ఆ జట్టును మెగా టోర్నమెంట్...
టీ20 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్
అధికారికంగా ప్రకటించిన ఐసీసీ
న్యూఢిల్లీ: భారత్ నుంచి తమ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు శ్రీలంకకు తరలించాలన్న మంకుపట్టు వీడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గట్టి షాకిచ్చింది. ఆ జట్టును మెగా టోర్నమెంట్ నుంచి తప్పిస్తున్నట్టు శనివారం అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్ స్థానంలో..ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్‌ను బరిలో దించుతున్నట్టు వెల్లడించింది. ‘ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ పోటీపడడం లేదు. బీసీబీ లేవనెత్తిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బంగ్లా జట్టుకు, ఆ దేశ అధికారులతోపాటు పౌరులకు భారత్‌లో ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ అంచనాకు వచ్చింది. ఇంకా ఇతర అంశాలను కూడా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఇప్పటికే నిర్ణయించిన టోర్నీ షెడ్యూల్‌ను సవరించడం సరికాదని భావించింది’ అని వివరించింది. భారత్‌లో పాల్గొంటుందో లేదో తెలియజేసేందుకు బంగ్లాదేశ్‌కు 24 గంటల సమయం ఇచ్చినట్టు ఈ సందర్భంగా ఐసీసీ గుర్తు చేసింది. ‘గడువులోగా ఏ విషయామూ బంగ్లాదేశ్ నిర్ధారించకపోవడంతో నిబంధనల ప్రకారం మరో జట్టుకు చోటు కల్పించాం. ర్యాంకులలో స్కాట్లాండ్ 14వ స్థానంలో ఉంది. బంగ్లా స్థానంలో గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్‌తో కలిసి స్కాట్లాండ్ ఆడుతుంది’ అని ఐసీసీ స్పష్టం చేసింది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచ కప్ వచ్చే నెల 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.
ఐసీసీ నిర్ణయంతో వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ కొనసాగే విషయమై నెల రోజులుగా ఏర్పడిన ప్రతిష్ఠంభనకు తెరపడింది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి తొలగించడంతో మొదలైన వివాదాన్ని బీసీబీ ప్రపంచ కప్‌నకు ముడిపెట్టింది. భద్రతా కారణాల సాకు చూపుతూ భారత్‌లో తాము ఆడాల్సిన మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని పదేపదే కోరుతూ వచ్చింది. అలా కాదంటే..గ్రూప్ ‘సి’లో తమకు బదులు ఐర్లాండ్‌ను చేర్చాలని, గ్రూప్ ‘బి’లో తమను ఆడించాలని ఐసీసీకి ప్రతిపాదించింది. గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. అయితే ఈ ప్రతిపాదనను ఐసీసీతోపాటు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి. మెగా టోర్నీలో భాగంగా వెస్టిండీస్ (ఫ్రిబవరి 7), ఇటలీ (ఫిబ్రవరి 9), ఇంగ్లండ్ (ఫిబ్రవరి 14)లతో కోల్‌కతాలో బంగ్లాదేశ్ తలపడాలి. అనంతరం ముంబై (ఫిబ్రవరి 17)లో నేపాల్‌ను బంగ్లా ఢీకొనాలి. ఇప్పుడు ఈ మ్యాచ్‌లలో బంగ్లాకు బదులు స్కాట్లాండ్ ఆడుతుంది.
ముప్పులేదని చెప్పినా..
అంతర్జాతీయ భద్రతా నిపుణులతో సర్వే చేయించామని, బంగ్లాదేశ్ జట్టు భద్రతకు భారత్‌లో ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ చెప్పింది. కానీ బీసీబీ భారత్‌కు వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ క్రీడా సలహాదారు అసిఫ్ నజ్రుల్ అయితే తమ జట్టు భారత్ వెళ్లే విషయంలో మొండిగా వ్యవహరించారు. ఫలితంగా మెగా టోర్నీలో ఆడాలన్న బంగ్లా క్రికెటర్ల కలలు కల్లలయ్యాయి.
బోర్డులో చర్చించి..
గత బుధవారం ఐసీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బీసీబీ డిమాండ్‌పై చర్చించింది. బంగ్లా డిమాండ్‌ను ఐసీసీ బోర్డు సభ్యులు 14-2 ఓటింగ్‌తో తిరస్కరించారు. అంతేకాదు తమ డిమాండ్‌ను పునఃపరిశీలించుకొనేందుకు బీసీబీకి ఐసీసీ కొంత సమయం కూడా ఇచ్చింది. అయినా తమ డిమాండ్‌కే బీసీబీ కట్టుబడి ఉండడంతో..ఐసీసీ కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. అంతకుముందు తమ డిమాండ్‌ను పరిశీలించాలని ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (డీఆర్‌సీ)ని కూడా బీసీబీ ఆశ్రయించింది. ఆ అంశం తమ పరిధిలోకి రాదని పేర్కొంటూ బీసీబీ విన్నపాన్ని డీఆర్‌సీ తోసిపుచ్చింది.
నెల రోజులుగా..
ఆర్ధిక నష్టం అంతింత కాదయా..
ప్రపంచ కప్‌లో ఆడకపోవడం బంగ్లాదేశ్‌కు భారీ నష్టాన్ని మిగల్చనుంది. ఇది వందల కోట్ల రూపాయలలో ఉండనుంది. టోర్నీలో పాల్గొనడం ద్వారా లభించే ఫీజు రూ. 4.57 కోట్ల (బంగ్లా కరెన్సీలో 6.06 కోట్ల టాకాలు)ను బీసీబీ కోల్పోనుంది. ఇక..టోర్నీ టాప్-12లో నిలిస్తే మరో 5.5 కోట్ల బంగ్లాదేశ్ టాకాలు లభిస్తాయి. ఇక.. బంగ్లాకు అతి పెద్ద నష్టం ఐసీసీ వార్షికంగా చెల్లించే మొత్తం రూపేణా జరగనుంది. తమ వాటా కింద బంగ్లా బోర్డు ప్రతి ఏటా రూ. 247.30 కోట్ల (బంగ్లా కరెన్సీలో 327.73 కోట్ల టాకాలు)ను ఐసీసీ నుంచి అందుకుంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బడ్జెట్‌లో ఇది 60 శాతం కావడం గమనార్హం. ఇప్పుడు ఐసీసీ ఈవెంట్ నుంచి ఆ జట్టు తప్పుకోవడంతో నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని బంగ్లా కోల్పోనుంది. ఇంకా..టోర్నీలో పాల్గొనకపోవడం వల్ల పెద్ద మొత్తంలోనే స్పాన్సర్‌షిప్ ఆదాయానికి కూడా గండి పడనుంది. ఇవన్నీగాక..ద్వైపాక్షిక సిరీ్‌సలకోసం భారత జట్టు బంగ్లాదేశ్ వెళ్లకపోవడంవల్ల బీసీబీకి కలిగే నష్టం అంతా ఇంతా కాదు. పది జట్లతో ఆడే ద్వైపాక్షిక సిరీ్‌సల ద్వారా లభించే ఆదాయం..ఒక్క భారత్‌తో తలపడే సిరీస్ ద్వారా వస్తుండడం విశేషం. ఇది బీసీబీకి కోలుకోని ఆర్థిక నష్టం. చివరగా..బంగ్లాదేశ్‌కు మిగిలిన ఏకైక మార్గం స్విట్జర్లాండ్‌లోని క్రీడా వివాదాల పరిష్కార కోర్టుకు వెళ్లడమే. కానీ అప్పటికే టోర్నమెంట్ మొదలై ఉంటుంది కాబట్టి.. బంగ్లా సమస్యకు పరిష్కారం లభించడం కష్టం.
ఈ వార్తలు కూడా చదవండి...
నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి
Read Latest Telangana News And Telugu News