ఆరు నెలలు కూడా ఆడలేనన్నారు.. పదేళ్లు పూర్తి చేసుకున్నా: బుమ్రా
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:26 AM
గువాహటి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో బుమ్రా గతంలో తనపై వచ్చిన విమర్శలపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: గువాహటి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. కివీస్ బ్యాటర్లకు తన బంతితో చెమటలు పట్టించాడు. కాగా రెండు మ్యాచులు మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. బుమ్రా మూడు వికెట్ల ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది. ఈ నేపథ్యంలో బుమ్రా(Jasprit Bumrah) గతంలో తనపై వచ్చిన విమర్శలపై స్పందించాడు.
‘అంతర్జాతీయ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప అనుభూతిని ఇస్తోంది. చిన్నప్పుడు భారత్ తరఫున ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని కలలు కనేవాడిని. కానీ పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతుండటం చాలా సంతోషానిస్తోంది. నేను ఆల్‌రౌండర్‌ను కాదు. ఫాస్ట్ బౌలర్ మాత్రమే. గాయాలు, విమర్శలు.. ఇలా ఎన్నో దాటుకుని ఈ స్థాయి వరకు వచ్చాను. నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు నా వినూత్నమైన బౌలింగ్ శైలిని చూసి నేను ఆరు నెలలు కూడా ఆటలో కొనసాగలేనని విమర్శించారు. కానీ దేశం తరఫున దశాబ్దపు కాలంగా ఆడుతున్నందుకు గర్వపడుతున్నాను. ఇది నా కెరీర్‌లో గొప్ప మైలురాయి. ఈ ప్రయాణం మరింత కాలం కొనసాగుతుందని ఆశిస్తున్నా’ అని బుమ్రా భావోద్వేగానికి గురయ్యాడు.
అదే ముఖ్యం..
‘ఈ మ్యాచులో నేను బౌలింగ్ చేయడానికి రాకముందు హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్య ఎలా బౌలింగ్ చేశారో, పిచ్ ఎలా స్పందిస్తుందో అని జాగ్రత్తగా గమనించాను. నేను బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు బంతి కాస్త పాతబడింది. సాధారణంగా వైట్ బాల్ ఎక్కువ సేపు స్వింగ్ కాదు. దాంతో ఈ పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు నేను చేయగలిగినదంతా చేయడానికి ప్రయత్నించాను. అది బాగా కలిసొచ్చింది. నేను జట్టు విజయాల్లో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. మ్యాచ్ చివరిలో బౌలింగ్ చేయమన్నా.. కొత్త బంతి, పాత బంతితో ఎప్పుడూ ఎక్కడ బౌలింగ్ చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఆసియా కప్‌లో కూడా నేను భిన్నమైన వాతావరణంలో బౌలింగ్ చేశాను. జట్టు అవసరాలకు తగ్గట్లు బౌలింగ్ చేయడం ముఖ్యం. నేను దానికి సిద్ధంగా ఉన్నా’ అని బుమ్రా వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
టీమిండియాను చూసి ప్రత్యర్థి జట్లు భయపడాల్సిందే: సునీల్ గావస్కర్
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా కన్నుమూత