ప్రతిదాంట్లో మీ జోక్యం ఎందుకు?.. పీసీబీ ఛైర్మన్ నఖ్వీపై భజ్జీ ఫైర్
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:39 PM
పీసీబీ ఛైర్మన్ నఖ్విపై టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌ను ప్రపంచ కప్ టోర్నీ నుంచి తొలగించడంపై నఖ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి విషయంలో పాకిస్తాన్ జోక్యం ఎందుకు అంటూ భజ్జీ ప్రశ్నించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభం కానుంది. ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి స్కాట్లాండ్‌ను రీప్లేస్ చేస్తున్నట్లు ఐసీసీ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 నుంచి రిలీజ్ చేయడంపై తీవ్రంగా స్పందిస్తూ.. తాము కూడా భారత్‌లో ఆడేందుకు రాబోమని బీసీబీ తేల్చి చెప్పింది. దీనికి పాకిస్తాన్ కూడా మద్దతు ప్రకటించింది. అవసరమైతే తాము కూడా ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తామని పీసీబీ ఛైర్మన్ నఖ్వి వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఐసీసీ.. పీసీబీకి చురకలు అంటించడంతో వెనక్కి తగ్గి పాకిస్తాన్ జట్టును ప్రకటించింది. ఈ వివాదాల నడుమ టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) నఖ్విపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘ఈ టోర్నీలో ఆడటం, ఆడకపోవడం అంతా బంగ్లాదేశ్ సమస్య.. పాకిస్తాన్‌ది కాదు. అవసరం లేని చోట ఎందుకు మీ జోక్యం? బంగ్లాదేశ్‌తో కలిసి భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా మురికి నీటిలో చేపలు పట్టే ప్రయత్నం అంటారు. టోర్నీ నుంచి తప్పుకునే ఆలోచనలు ఉన్నట్టు మీరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నీరుగారిపోయాయి. ఇన్ని వివాదాల నడుమ నష్టపోయేది మాత్రం బంగ్లా ఆటగాళ్లే. ఓ ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం కోల్పోవడం చిన్న విషయం కాదు. ఆటగాళ్ల కెరీర్‌లపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది’ అని భజ్జీ వెల్లడించాడు.
ఇదంతా ‘ఈగో’..
‘బంగ్లా ఆటగాడిని ఇక్కడ ఆడించలేదని.. వారి జట్టు మొత్తాన్నే భారత్‌కి పంపడానికి నిరాకరించారు. ఇక్కడ బంగ్లా క్రికెట్ బోర్డు వ్యవహార శైలే పద్ధతిగా లేదు. దేనికైనా చర్చల ద్వారానే పరిష్కారం వెతకాలి. కానీ వారు నేరుగా ‘భారత్‌కు రాం’ అని చెప్పడం తప్పు. ఇది ఈగో సమస్యగా మారింది. భారత పిచ్‌లపై బంగ్లా స్పిన్నర్లకు మంచి అవకాశాలుండేవి. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలో అయితే వారికి కష్టమయ్యేది. ఇక్కడ అయితే రెండో రౌండ్‌కి చేరి కొన్ని సంచలనాలు సృష్టించే అవకాశం కూడా ఉండేది. ఈ రాజకీయ ఒత్తిళ్లు ఆటగాళ్ల కెరీర్‌పై ప్రభావం పడేలా చేశాయి’ అని హర్భజన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
నా రికార్డును బ్రేక్ చేయలేకపోయావ్.. అభిషేక్ శర్మను ఆటపట్టించిన యువీ
టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రపంచ కప్ నాటికి స్టార్ ప్లేయర్‌కు పూర్తి ఫిట్‌నెస్!