సివర్ రికార్డు శతకం
ABN , Publish Date - Jan 27 , 2026 | 06:24 AM
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ వరుస ఓటములకు బ్రేక్ పడింది. డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన వేళ ఆల్‌రౌండ్‌షో కనబర్చింది...
డబ్ల్యూపీఎల్‌లో నేడు
గుజరాత్ X ఢిల్లీ (రా. 7.30)
బెంగళూరుకు మరో ఓటమి
పోరాడిన రిచా ఘోష్
మహిళల ప్రీమియర్ లీగ్
ముంబై కీలక విజయం
వడోదర: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ వరుస ఓటములకు బ్రేక్ పడింది. డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన వేళ ఆల్‌రౌండ్‌షో కనబర్చింది. టోర్నీ చరిత్రలోనే నాట్ సివర్ బ్రంట్ (57 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌తో 100 నాటౌట్) తొలి శతకం సాధించి రికార్డు సృష్టించగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 15 రన్స్ తేడాతో నెగ్గింది. 2023లో ఆరంభమైన డబ్ల్యూపీఎల్ 82వ మ్యాచ్‌లో ఈ సెంచరీ నమోదు కావడం విశేషం. అటు బ్రంట్ కెరీర్‌లో కూడా ఇదే తొలి టీ20 శతకం. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. మాథ్యూస్ (39 బంతుల్లో 9 ఫోర్లతో 56) వేగంగా ఆడింది. బెల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ ఛే దనలో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 184 పరుగులు చేసి ఓడింది. రిచా ఘోష్ (50 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 90) ఒంటరి పోరాటం చేయగా డిక్లెర్క్ (28) ఫర్వాలేదనిపించింది. మాథ్యూ్‌సకు మూడు, షబ్నింకు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా సివర్ బ్రంట్ నిలిచింది.
వణికించిన రిచా: ముంబై బౌలర్లను ఎదుర్కోవడంలో ఆర్‌సీబీ బ్యాటర్లు దారుణంగా తడబడ్డారు. అయితే రిచా మాత్రం భారీ షాట్లతో చివరి వరకు నిలిచి ముంబైని భయపెట్టింది. పేసర్లు మాథ్యూస్, షబ్నింల ధాటికి పవర్‌ప్లే ముగిసేలోపే టాప్-5 బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరారు. అప్పటికి స్కోరు కేవలం 35 పరుగులే. ఈ స్థితిలో రిచా ఘోష్.. డిక్లెర్క్‌తో ఆరో వికెట్‌కు 42 పరుగులు, అరుంధతి (14)తో కలిసి ఏడో వికెట్‌కు 52 రన్స్ అందించింది. ఇక చివరి రెండు ఓవర్లలో 59 రన్స్ కావాల్సిన వేళ రిచా విరుచుకుపడింది. 19వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు, శ్రేయాంక (12 నాటౌట్) రెండు ఫోర్లతో 27 రన్స్ అందాయి. ఇక సమీకరణం ఆరు బంతుల్లో 32 రన్స్‌కు మారడంతో సంచలనం చోటుచేసుకుంటుందా.. అనిపించింది. అయితే 4,4,6 బాది ఆఖరి బంతికి అవుటైన రిచా కొద్దిలో శతకాన్ని కోల్పోయింది.
సివర్-మాథ్యూస్ శతక భాగస్వామ్యం: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్ ఆచితూచి ఆరంభమైంది. ఓపెనర్ సజన (7) మూడో ఓవర్‌లోనే వెనుదిరగ్గా.. పవర్‌ప్లేలో 38 పరుగులు చేయగలిగింది. కానీ ఆ తర్వాతే ఆర్‌సీబీ బౌలర్లకు కష్టాలు ఆరంభమయ్యాయి. సివర్ బ్రంట్ జోరుకు ఓపెనర్ మాథ్యూస్ మెరుపులు జత కలవడంతో స్కోరు ఊపందుకుంది. వీరి ధాటికి పేసర్ లారెన్ బెల్ మినహా అంతా ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. వరుస ఓవర్లలో బౌండరీలు బాదేస్తూ రన్‌రేట్‌ను అమాంతం పెంచేశారు. ఇదే క్రమంలో సివర్ 32 బంతుల్లో, మాథ్యూస్ 34 బంతుల్లో తమ అర్ధసెంచరీలను కూడా పూర్తి చేశారు. 15వ ఓవర్‌లో మాథ్యూ్‌సను బెల్ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. డెత్ ఓవర్లలో కాస్త జోరు తగ్గి హర్మన్ (20), అమన్ (4) వరుస ఓవర్లలో వెనుదిరిగారు. అయితే ఆఖరి ఓవర్‌లో సింగిల్‌తో సివర్ 57 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకుంది.
సంక్షిప్త స్కోర్లు: ముంబై: 20 ఓవర్లలో 199/4 (సివర్ బ్రంట్ 100 నాటౌట్, మాథ్యూస్ 56, బెల్ 2/21) బెంగళూరు: 20 ఓవర్లలో 184/9 (రిచా 90, డిక్లెర్క్ 28; మాథ్యూస్ 3/10, షబ్నిం 2/25, కెర్ 2/37)
ఇవి కూడా చదవండి:
సివర్ రికార్డు శతకం
మా వాళ్లతో జాగ్రత్త.. పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్
అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ