Share News

ఒకే శరీరంలో ఇద్దరు మహిళలు.. తల్లీ తానే.. మృత్యువు తానే

ABN , Publish Date - Sep 05 , 2026 | 03:28 PM

ఒకే శరీరంలో ఇద్దరు మహిళలు. అందులో ఒకామె ముగ్గురు పిల్లలకు తల్లి. మరొకామె ఆ ముగ్గురినీ చంపిన హంతకురాలు. ఇదేదో ఓ కొత్త కొరియన్ సినిమా కథ అనుకుంటున్నారా.? కాదు కాదు.. అమెరికాలో జరిగిన యథార్థ ఘటన. మరి అసలు కథ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం...

ఒకే శరీరంలో ఇద్దరు మహిళలు.. తల్లీ తానే.. మృత్యువు తానే
Lindsay Clancy

ఇంటర్నెట్ డెస్క్: ఆలనా పాలనా చూడాల్సిన తల్లే.. తన ముగ్గురి పిల్లలను బలి తీసుకుంది. అయితే ఈ కేసు విచారణలో దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి. అమెరికాకు చెందిన లిండ్సే క్లాన్సీ, పాట్రిక్ క్లాన్సీ దంపతులకు ముగ్గురు పిల్లలు. 2023 జనవరిలో లిండ్సే తన ముగ్గురు పిల్లలను అత్యంత దారుణంగా హతమార్చింది. ఆ తరవాత తానూ ఆత్మహత్య చేసుకోవడానికి తమ ఇంటి రెండో అంతస్తు నుంచి దూకేసింది. అయితే ఆమె చనిపోలేదు. కానీ తీవ్ర గాయాలు కావడంతో ఆమెకు పక్షవాతం వచ్చింది. ఆ తరవాతే అసలు కథ మొదలైంది.


పక్షవాతంతో ఉన్న లిండ్సే ఆసుపత్రి నుంచే కోర్టు విచారణకు హాజరైంది. 'ఎందుకు నీ కన్నబిడ్డలను నువ్వే చంపుకున్నావ్.?' అని న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ విస్తుపోయేలా చేసింది. ‘ఒక మగ గొంతు నాకు వినిపించింది. ముగ్గురు పిల్లలను చంపాలని నన్ను ఆదేశించింది. ఆపై ఆత్మహత్య చేసుకోవాలనీ చెప్పింది. ఈ పని చేయడానికి ఇదే మంచి సమయమని, ఇలాంటి అవకాశం మళ్లీ రాదని నూరిపోసింది. అది చెప్పినట్టే నేను చేశా’ అని ఆమె కోర్టుకు వివరించింది. దీంతో కోర్టులోని వారంతా ఆశ్చర్యపోయారు. అయితే ఆమె ఇలా చేయడానికి ప్రసవాంతర మానసిక రుగ్మత కారణమని వైద్యులు చెబుతున్నారు. వరుసగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాక ఏర్పడిన ఒత్తిడి ఈ హత్యలకు దారి తీసిందని అంటున్నారు.


తల్లీ, హంతకురాలు ఒక్కరు కాదు..

విచారణ సందర్భంగా లిండ్సేను పరీక్షించడానికి కోర్టు ఇద్దరు వైద్య నిపుణులను నియమించింది. వీరు రెండు భిన్నమైన నివేదికలను సమర్పించారు. అందులో ఒక నివేదిక.. తల్లి, హంతకురాలు ఒక్కరే కాదని చెబుతోంది. పిల్లలను హత్య చేస్తున్న విషయం కూడా లిండ్సేకు తెలియదని తెలిపింది. ఆమె మానసిక స్థితి బాగోకపోవడమే ఇందుకు కారణమని వివరించింది. మరో నివేదిక మాత్రం లిండ్సేకి అంతా తెలిసే హత్యలు చేసిందని చెప్పింది. భర్త పాట్రిక్ ఇంటి నుంచి వెళ్లేవరకు ఆగి, మంచి సమయం దొరికాక ఆమె పిల్లలను కడతేర్చిందని వెల్లడించింది.

అయితే మానసిక రుగ్మత కారణంగానే ఈ హత్యలు జరిగాయని స్పష్టంగా తెలుస్తున్నా కోర్టు ముందు సులభంగా సమాధానం చెప్పలేని ప్రశ్న ఒకటుంది. ప్రసవాంతర మానసిక రుగ్మతల కారణంగా తల్లే పిల్లలను చంపేస్తే.. ఆమెను చట్టపరంగా నేరస్థురాలిగా పరిగణించాలా.. వద్దా అనేదానికి జవాబు చెప్పడం కోర్టుకు తలనొప్పిగా మారింది.


ఇవి కూడా చదవండి

వంట విషయంలో గొడవ.. భార్యను కొట్టి చంపిన భర్త..

బెంగళూరులో దారుణం.. అప్పు తీర్చలేదని మహిళను వివస్త్రను చేసి..

Updated Date - Sep 05 , 2026 | 05:19 PM