9/11 దాడులు.. వారం ముందే అమెరికాకు హెచ్చరిక..
ABN , Publish Date - Sep 05 , 2026 | 02:57 PM
అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటైన 9/11 ఉగ్రదాడులు జరిగి పాతికేళ్లు పూర్తవుతోంది. 2001, సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను ఆల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలతో ఢీకొట్టించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటైన 9/11 ఉగ్రదాడులు జరిగి పాతికేళ్లు పూర్తవుతోంది. 2001, సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను ఆల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలతో ఢీకొట్టించారు. ఈ దాడుల్లో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన జరగడానికి ముందే అల్‌ఖైదా ముప్పుపై అమెరికా ప్రభుత్వానికి కీలక హెచ్చరిక అందింది (9/11 attacks Al-Qaeda warning).
ఘటన జరగడానికి వారం రోజుల ముందు సెప్టెంబర్ 4వ తేదీన అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ తన ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులతో వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వైట్‌హౌస్ కౌంటర్ టెర్రరిజం అధికారి రిచర్డ్ క్లార్క్ (Richard Clarke) ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికన్లను హతమార్చేందుకు అల్‌ఖైదా ఏమాత్రం వెనుకాడదని, ఆ ఉగ్ర సంస్థను ఎదుర్కోవడంలో అమెరికా నిజంగా సీరియస్‌గా ఉందా? అని క్లార్క్ ప్రశ్నించారు.
నిజానికి అల్‌ఖైదాపై క్లార్క్ అంతకు ముందే ఆందోళన వ్యక్తం చేశారు. 2000 అక్టోబర్‌లో యెమెన్‌లో అమెరికా నేవీకి చెందిన యూఎస్‌ఎస్ కోల్ నౌకపై అల్‌ఖైదా బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 17 మంది అమెరికా నావికులు మరణించారు. ఆ ఘటన తర్వాత అల్‌ఖైదాపై కఠిన చర్యలు తీసుకోవాలని క్లార్క్ పట్టుబట్టారు. అమెరికా ఎలాంటి ప్రతీకారమూ తీసుకోకపోతే.. అమెరికన్లపై దాడులు చేసినా పెద్దగా మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉండదని అల్‌ఖైదా, తాలిబన్లు భావిస్తారని క్లార్క్ పేర్కొన్నారు (White House warning Al-Qaeda).
అల్‌ఖైదా ప్రమాదంపై 2001 జనవరి 25న అప్పటి జాతీయ భద్రతా సలహాదారు కాండోలీజా రైస్‌కు క్లార్క్ ఒక మెమో పంపారు (September 11 attacks). అందులో అల్‌ఖైదాను 'చురుకైన, వ్యవస్థీకృతమైన ప్రధాన ఉగ్రవాద శక్తి'గా అభివర్ణించారు. ఈ సంస్థను తక్కువ అంచనా వేయడం అమెరికా చేసే పెద్ద తప్పిదం అవుతుందని హెచ్చరించారు. అల్‌ఖైదాపై వెంటనే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కూడా క్లార్క్ కోరారు. అయితే ఆ సమావేశం జరగడానికి సెప్టెంబర్ 4 వరకు సమయం పట్టింది. అంటే ఆయన జనవరిలో కోరిన సమావేశం.. 9/11 దాడులకు వారం ముందు మాత్రమే జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి:
లాటరీలో గెలవగానే ఇల్లు వచ్చినట్లు కాదు!