విరిగిపడిన కొండచరియలు.. నేపాల్‌కు మళ్లీ వరద ముప్పు..
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:00 PM
నేపాల్‌ను వరద భయం మరోసారి వెంటాడుతోంది. దార్చులా జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడి, చౌలాని నది ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో దిగువ ప్రాంతాల్లో ఒక్కసారిగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు..
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో మరోసారి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. దార్చులా జిల్లాలోని అపీ హిమాలా గ్రామ పంచాయతీ పరిధిలో భట్టర్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మట్టి.. రాళ్లు చౌలాని నదిలోకి జారిపడటంతో నదీ ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండచరియలు నదిని కొంతమేర అడ్డుకోవడంతో నీటి ప్రవాహం మందగించింది. పరిస్థితి మరింత తీవ్రమైతే మట్టి, రాళ్లతో నది పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఎగువ ప్రాంతాల్లో నీరు నిలిచి.. ఒక్కసారిగా దిగువ ప్రాంతాల వైపు భారీగా ప్రవహించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో నదీ తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు.. నదీ ప్రవాహానికి మరింత ఆటంకం ఏర్పడితే ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉండటంతో దార్చులా జిల్లా పరిపాలన యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు సమాచారం అందిస్తూ.. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. నదికి సమీపంలో ఉన్న ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవద్దని, నీటి మట్టంలో మార్పులు కనిపించినా, నదీ ప్రవాహం అకస్మాత్తుగా పెరిగినా.. వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నదీ తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లాటరీలో గెలవగానే ఇల్లు వచ్చినట్లు కాదు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News