నేపాల్ వరదల్లో శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరు.. 10 రోజుల తర్వాత..
ABN , Publish Date - Sep 05 , 2026 | 03:13 PM
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 1,300 మంది మరణించగా, మరో 5,000 మందికి పైగా గల్లంతయ్యారని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ఆగస్టు 26న సంభవించిన ఈ వరదలు హిమానీనదం కూలిపోవడం వల్ల ఏర్పడి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 1,300 మంది మరణించగా, మరో 5,000 మందికి పైగా గల్లంతయ్యారని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరదలు, బురద, శిథిలాల మధ్య సహాయక బృందాలు రోజుల తరబడి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బురద, శిథిలాల మధ్య 10 రోజులుగా చిక్కుకున్న ఓ చైనా కార్మికుడితో పాటు 64 ఏళ్ల నేపాల్ వృద్ధురాలిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి.
జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన సొరంగంలో చిక్కుకున్న ఓ చైనా కార్మికుడిని సహాయక బృందాలు సజీవంగా బయటకు తీశాయి. శుక్రవారం ఇదే ప్రాంతంలోని త్రిశూలి 3A జలవిద్యుత్ కేంద్రం సొరంగం నుంచి ఇద్దరు నేపాలీ కార్మికులను రక్షించిన విషయం తెలిసిందే. తాజాగా చైనా కార్మికుడిని కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నేపాల్ సైనిక సిబ్బంది, దక్షిణ కొరియాకు చెందిన విపత్తు నిర్వహణ నిపుణులు కలిసి ఈ రక్షణ చర్యలు చేపట్టారు. 225 మీటర్ల పొడవైన సొరంగం నుంచి కార్మికుడిని బయటకు తీసుకొచ్చిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు, నువాకోట్ పట్టణంలో 64 ఏళ్ల చండికా శ్రేష్ఠ అనే వృద్ధురాలిని కూడా శనివారం సహాయక బృందాలు సజీవంగా రక్షించాయి. దెబ్బతిన్న ఇంటి శిథిలాల కింద 10 రోజులుగా చిక్కుకున్న ఆమెను సిబ్బంది ఎంతో శ్రమించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్‌లో ఖాట్మండూకు తరలించారు. 10 రోజుల పాటు శిథిలాల కింద చిక్కుకున్నప్పటికీ ఆమె ప్రాణాలతో బయటపడటం అద్భుతంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆమెను రక్షిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ దృశ్యాలు నేపాల్‌లో వరదలు, విధ్వంసం ఎంతటి దయనీయ పరిస్థితిని సృష్టించాయో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, నేపాల్‌లోని 12 జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న దాదాపు 900 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియడం లేదని అధికారులు తెలిపారు. వీరిలో సుమారు 500 మంది వివిధ సొరంగాల్లో చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Also Read:
సురేఖను కాపాడేందుకు చాలా ప్రయత్నించాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
పాక్‌తో మ్యాచ్.. స్మృతి మంధానని ఊరిస్తున్న ఆల్‌టైమ్ రికార్డు